ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణ పనులు నిలిపివేయాలి: మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి

  • బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు, గ్రామస్తులు కలెక్టర్ ప్రతిమాసింగ్ కు వినతి

మెదక్ జిల్లాలో కాలుష్య కారకంగా మారిన ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ కంపెనీ విస్తరణను తక్షణమే నిలిపివేసి, ఆ కంపెనీని తొలగించాలని గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలతో తరలివచ్చి కలెక్టర్ ప్రతిమాసింగ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలోని మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల పరిధిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాలుష్య కారకంగా మారిందన్నారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గ్రామాల్లోని ప్రజలు పలు అనారోగ్యాలకు గురవుతున్నట్లు తెలిపారు. అలాగే భూగర్భ జలాలు, వ్యవసాయ భూములు కూడా దెబ్బతిన్నట్లు చెప్పారు. కంపెనీ విస్తరణకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని, కంపెనీని పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటైనప్పటి నుండి రంగాయపల్లి, చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు కంపెనితో కుమ్మక్కు కావడం సరైనది కాదని తెలిపారు. కంపెనీ వల్ల గాలి, నీటి కాలుష్యంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాస్వామ్య బద్దంగా లేదని, వెంటనే కంపెనీని రద్దు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. చర్యలు తీసుకోకపోతే కంపెనీకి వ్యతిరేకంగా ఎద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.