ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంఎస్ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమను వెంటనే మూసేయాలి: గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి

  • రెండు గ్రామాలకు ప్రజలకు అండగా ఉంటాం..
  • అధికారులకు కాలుష్యంపై పట్టింపు లేదా..?
  • పరిశ్రమ లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంఎస్ అగర్వాల్ కంపెనీ
  • ప్రజాసామ్యబద్ధంగా పోరాటం చేస్తాం: గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి వెల్లడి
  • రంగాయపల్లి, చెట్ల గౌరారం ప్రజలతో కలిసి ఒకరోజు నిరాహార దీక్ష
  • పార్టీలకు అతీతంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, పర్యావరణ వేత్తలు, మేధావుల మద్దతు

పరిశ్రమ లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమను వెంటనే ఇక్కడ నుంచి తీసివేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో రంగాయపల్లిలో ఆదివారం ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఈ నిరాహార దీక్షకు సంఘీభావంగా రంగాయపల్లి, చెట్ల గౌరారం ప్రజలు, ఇతర పార్టీల రాజకీయ నాయకులు, మేధావులు, పలువురు పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ కంపెనీ హటావో.. రంగాయపల్లి, చెట్ల గౌరారం గ్రామాలను బచావో అంటూ నినదించారు. ప్రజలు ఎక్కడ అధైర్య పడొద్దని, కంపెనీని తొలిగించే వరకు ప్రజాస్వామ్యబద్దంగా పోరాటం చేస్తానని గ్రామస్తులకు భరోసా కల్పించారు.

తమ లాభాల కోసం, స్వార్ధం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమ విస్తరణను అడ్డుకోవడమే కాకుండా ఉన్న పరిశ్రమను వెంటనే తొలిగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తొలగించే వరకు ప్రజల తరపున ప్రజస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామన్నారు. మా పిల్లల ప్రాణాలను, మా పిల్లల భవిష్యత్తును కాపాడుకుంటామని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. 20 ఏండ్లుగా ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమ యాజమాన్యం ఇక్కడి ప్రజలకు కాలుష్యాన్ని ఇచ్చి, రూ.వేల కోట్లు సంపాదించుకుందని అన్నారు. పరిశ్రమ కాలుష్యంతో వందలాది మంది చనిపోయారని, వేలాది మంది ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ కారణంగా నేల, గాలి, నీటి కాలుష్యంతో పాటు ప్రకృతి వనరులు దెబ్బతింటున్నాయని తెలిపారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ అగర్వాల్‌ పరిశ్రమకి కాలం దగ్గర పడిందని, తట్టా బుట్టా సర్దుకొనే రోజులు దగ్గరలోనే ఉందన్నారు.

పరిశ్రమను నడపడానికి అడ్డదారులు తొక్కి, డబ్బు బలంతో అధికారులు, పోలీసులతో ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమ కుమ్మక్కైందని ఆరోపించారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే హక్కు పరిశ్రమకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పరిశ్రమ కాలుష్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ అనేది కంపెనీలో కాకుండా గ్రామంలోని నడిబొడ్డున చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీలకతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాడి ఎంఎస్‌ అగర్వాల్‌ కంపెనీని మన ప్రాంతం నుంచి పారదోలి, ప్రజల ప్రాణాలను కాపాడుకుందామని వంటేరు ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మానవత్వంతో ఆలోచించి, పరిశ్రమను సందర్శించి ఇక్కడి ప్రజలు బాధలు తెలుసుకోవాలన్నారు. వారం రోజుల్లో మరోసారి కలెక్టర్‌ని కలిసి వినతి పత్రం ఇస్తామని వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. దీక్షలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రంగాయపల్లి, చెట్ల గౌరారం ప్రజలు, మేధావులు, పర్యావరణ వేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.