ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి విద్యార్థి తీసుకోవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  • మిషన్ ప్రకృతి.. పర్యావరణ పరిరక్షణలో గురుకుల విద్యార్థులు ఆదర్శం
  • WWF-ఇండియా – TGSWREIS సంయుక్త ఆధ్వర్యంలో మిషన్ ప్రకృతి అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహణ

హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, పచ్చని పర్యావరణాన్ని అందించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన, బాధ్యత పెంపొందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రకృతిని కాపాడే ఉద్యమంలో గురుకుల విద్యార్థులు ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) ప్రధాన కార్యాలయంలో WWF-ఇండియా, హైదరాబాద్ కార్యాలయం మరియు TGSWREIS సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిషన్ ప్రకృతి అవార్డుల ప్రదానోత్సవం కార్క్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… ఉత్తమ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థి ప్రకృతి మిత్రులకు అవార్డులు, ప్రశంసా పత్రాలను అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుందని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, జలవనరులను పరిరక్షించి పునరుద్ధరించేందుకు HYDRAA ద్వారా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడం, వర్షపు నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించడం, నగర పర్యావరణ సమతుల్యతను కాపాడటం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని మంత్రి అన్నారు. మొక్కలు నాటడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం, నీటి వనరులను సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. గురుకుల విద్యార్థులు విద్యలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి అభినందించారు. మిషన్ ప్రకృతి వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ ప్రకృతి కార్యక్రమం సాధించిన విజయాలను నిర్వాహకులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 238 టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ గురుకుల విద్యాసంస్థలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనగా, 1,478 మంది నేచర్ క్లబ్ సభ్యులు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పరోక్షంగా 1.75 లక్షలకు పైగా విద్యార్థులకు పర్యావరణ అవగాహన కల్పించబడింది.

అలాగే 470 మందికి పైగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయగా, ప్రతి పాఠశాలలో క్యాంపస్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు రూపొందించారు. పౌర విజ్ఞాన (Citizen Science) కార్యక్రమాల ద్వారా వేల సంఖ్యలో జీవవైవిధ్య పరిశీలనలను నమోదు చేశారు. నేచర్ క్లబ్‌లు, గ్రీన్ క్యాబినెట్లు, జీవవైవిధ్య మ్యాపింగ్, పర్యావరణ అవగాహన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో విశిష్ట సేవలు అందించిన ఉత్తమ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థి ప్రకృతి మిత్రులను మంత్రి సత్కరించి అభినందించారు.

మంత్రి అడ్లూరి మాట్లాడుతూ “విద్యార్థులకు పుస్తక విజ్ఞానంతో పాటు ప్రకృతి విజ్ఞానం కూడా ఎంతో అవసరం. పర్యావరణ పరిరక్షణను జీవన విధానంగా అలవరచుకున్నప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతి గురుకుల విద్యార్థి ప్రకృతికి రాయబారిగా మారాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను హరిత, పరిశుభ్ర, పర్యావరణహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది” అని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన WWF-ఇండియా, TGSWREIS, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థలకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మిషన్ ప్రకృతి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించి జీవవైవిధ్య పరిరక్షణను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా WWF-ఇండియా ట్రస్టీ & WWF-ఇండియా హైదరాబాద్ కార్యాలయ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ శ్రీ అనిల్ కుమార్ వి. ఎపూర్ మాట్లాడుతూ, “మిషన్ ప్రకృతి కేవలం ఒక కార్యక్రమం కాదు, భవిష్యత్ తరాల్లో ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందించే ప్రజా ఉద్యమం. విద్యార్థులు ప్రకృతిని అర్థం చేసుకుని, జీవవైవిధ్య పరిరక్షణలో నాయకత్వం వహిస్తే తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. WWF-ఇండియా ఈ దిశగా ప్రభుత్వంతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉంది” అని అన్నారు. WWF-ఇండియా హైదరాబాద్ కార్యాలయ అడ్వైజరీ బోర్డు సభ్యురాలు శ్రీమతి వనితా దాట్ల మాట్లాడుతూ, “ప్రతి విద్యార్థి పర్యావరణ హిత కార్యక్రమాల్లో భాగస్వామి కావాలి. మార్పు కోసం ఎదురు చూడకుండా, మార్పుకు నాయకత్వం వహించాలి. తెలంగాణను పర్యావరణ అవగాహన కలిగిన (Eco-literate) రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలి. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ సమాజానికి, ప్రకృతికి సేవ చేయాలి” అని సూచించారు.

WWF-ఇండియా, హైదరాబాద్ కార్యాలయం రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి ఫరీదా టంపాల్ మాట్లాడుతూ… మిషన్ ప్రకృతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS), ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు భాగస్వామ్య సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ విద్య, జీవవైవిధ్య పరిరక్షణ, పౌర విజ్ఞాన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందించడం WWF-ఇండియా ప్రధాన లక్ష్యమని, మిషన్ ప్రకృతి ద్వారా వేలాది మంది విద్యార్థులు ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో TGSWREIS జాయింట్ సెక్రెటరీ అడ్మిన్ సక్రు నాయక్,WWF-ఇండియా, హైదరాబాద్ కార్యాలయం సిబ్బంది పి.ఎస్.ఎం. శ్రీనివాస్, ఎం.ఎస్. తిరుమలేశ్వరరావు, మహేందర్ మరియు ఎస్.ఎం. అక్బర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.