మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ దూరదృష్టితో మైనారిటీ బాలికల భవిష్యత్తుకు బలమైన పునాది

  • నాలుగు టీజీఎంఆర్ఈఐఎస్ జూనియర్ కళాశాలల నుంచి 120 మంది విద్యార్థినులతో కెరీర్ రెడీనెస్ బూట్‌క్యాంప్ విజయవంతంగా ముగింపు
  • రాష్ట్రంలోని 98 టీజీఎంఆర్ఈఐఎస్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 15,520 మందికి పైగా మైనారిటీ బాలికలకు విస్తరించనున్న కార్యక్రమం

హైదరాబాద్ : మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGMREIS), మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ నాయకత్వంలో, లాంచ్ గర్ల్స్ (Launch Girls) సంస్థతో భాగస్వామ్యంగా నిర్వహించిన ఐదు రోజుల కెరీర్ రెడీనెస్ బూట్‌క్యాంప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీజీఎంఆర్ఈఐఎస్‌కు చెందిన నాలుగు జూనియర్ కళాశాలల నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి మరియు నాయకత్వ అవకాశాలకు సిద్ధం చేసేలా ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ బూట్‌క్యాంప్‌లో నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, జట్టు భావన, సమస్యల పరిష్కారం, ఆర్థిక అవగాహన, కెరీర్ ప్రణాళిక, డిజైన్ థింకింగ్, వ్యక్తిత్వ వికాసం, ప్రొఫెషనల్ ప్రజెంటేషన్ వంటి అంశాలపై కార్యాచరణ ఆధారిత శిక్షణ అందించబడింది. ఈ పైలట్ కార్యక్రమం టీజీఎంఆర్ఈఐఎస్‌కు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 98 బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ద్వారా 15,520 మందికి పైగా మైనారిటీ బాలికలకు నాణ్యమైన విద్య అందిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అనుభవం, ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో టీజీఎంఆర్ఈఐఎస్ పరిధిలోని అన్ని జూనియర్ కళాశాలలకు కెరీర్ రెడీనెస్ కార్యక్రమాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి.

లాంచ్ గర్ల్స్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శ్రీమతి నేహా సాహు మాట్లాడుతూ, మైనారిటీ బాలికల్లో ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించి ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మైనారిటీల సంక్షేమ శాఖ మరియు టీజీఎంఆర్ఈఐఎస్ అందించిన సహకారాన్ని ఆమె అభినందించారు. ఆతిథ్య కళాశాల ప్రిన్సిపాల్ ఈ బూట్‌క్యాంప్ విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, భవిష్యత్ జీవితానికి అవసరమైన నైపుణ్యాలను అందించిన విశిష్ట కార్యక్రమమని పేర్కొన్నారు. పాల్గొన్న విద్యార్థినులు కూడా ఈ కార్యక్రమం ద్వారా కమ్యూనికేషన్, నాయకత్వం, ఆర్థిక నిర్వహణ, కెరీర్ ప్రణాళిక వంటి అనేక కీలక నైపుణ్యాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. లాంచ్ గర్ల్స్ సంస్థ, మైనారిటీ బాలికల విద్యా మరియు ఆర్థిక సాధికారతకు కట్టుబడి దూరదృష్టితో నాయకత్వం వహిస్తున్న మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే టీజీఎంఆర్ఈఐఎస్ అధ్యక్షులు మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ, కార్యదర్శి బి. షఫీయుల్లా, ఐఎఫ్‌ఎస్ మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారిని ఆత్మవిశ్వాసంతో కూడిన, స్వయం సమృద్ధి సాధించే పౌరులుగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంది.