- తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే మహోత్సవం ‘ఆషాడ బోనాల ఉత్సవాలు’
- బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా-జమున సంస్కృతికి ప్రతీక
- అమ్మవార్ల కరుణాకటాక్షాలతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతన్నలు సుభిక్షంగా ఉండాలి
- బోనాలను కనుల పండువగా నిర్వహించేందుకు రూ. 20 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
- జూలై 16న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ప్రారంభమై, ఆగస్టు 13న హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణకు వరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం
- ఆషాడ బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఎంతో సమన్వయంతో పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలకు అభినందనలు
- ఆషాడ బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ
తెలంగాణ ఆత్మను, సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాడ బోనాల ఉత్సవాలు తెలంగాణకు ప్రత్యేకమైన శక్తి ఆరాధనా పండుగ అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ అన్నారు. రేపు (జూలై 16) ఆషాడ బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం కాదు, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సాంస్కృతిక మహోత్సవం అని మంత్రి సురేఖ అన్నారు. రేపటి (జూలై 16) నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు 3వేలకు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి సురేఖ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా-జమున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని, లౌకిక స్ఫూర్తిని చాటుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాలు రేపు (జూలై 16) గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ప్రారంభమై, ఆగష్టు 13 న హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలోని అమ్మవారికి బోనాల సమర్పణ అనంతరం ఘటాల నిమజ్జనంతో ముగుస్తాయని మంత్రి సురేఖ తెలిపారు.
రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు బోనాల ఉత్సవాల్లో పాల్గొనే పరిస్థితుల నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు ఈ యేడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించడం పై మంత్రి సురేఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవార్ల దయతో ఈ యేడాది వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, సమృద్ధిగా పంటలు పండేలా పరిస్థితులు నెలకొనాలని మంత్రి ఆకాంక్షించారు. భక్తులు సంతోషంగా అమ్మవార్లను దర్శించుకుని, బోనాలు సమర్పించి, తిరిగి సంతోషంగా ఇండ్లకు చేరుకునేలా అన్ని శాఖలు ఏర్పాట్లను పూర్తిచేసినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు.