హెజెలో కంపెనీలో విషాదం.. రియాక్టర్‌లో పడి ఏజీఎం అనుమానాస్పద మృతి..!

  • నిబంధనలు బేఖాతరు.. భద్రతా ప్రమాణాలు శూన్యం
  • నాలుగు నెలల క్రితమే ఇద్దరు ఉద్యోగులకు తప్పిన ప్రమాదం.. అయినా మారని వైనం
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన పీసీబీ ఈఈ వెంకన్న;
  • కాలుష్య పరిశ్రమలను తరలించాలని ‘పోరాట సమితి’ డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం పరిధిలోని హేజేలో ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్లను శుభ్రం చేస్తుండగా.. అందులో నుంచి వెలువడిన రసాయన విషవాయువులను పీల్చి కార్మికుడు మృతిచెందాడు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. కంపెనీ యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు రాకుండా దాచిపెట్టింది. వివరాల్లోకి వెళతే.. ఏపీలోని అనంతపురం జిలి్లా సింగనమల మంలడం ఉల్లికల్లు గ్రామానికి చెందిన అలుమూరు కృష్ణారెడ్డి (42) హెజేలో కంపెనీలో పనిచేస్తున్నాడు. కొత్త మందుల బ్యాచ్ తయారీ కోసం గురువారం సాయంత్రం రికార్టర్లను శుభ్రం చేస్తుండగా అందులో నుంచి వెలువడిన విషయవాయువులను పీల్చడంతో కృష్ణారెడ్డి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే కృష్ణారెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి హుటాహుటిన తరలించగా.. అప్పటికే కృష్ణారెడ్డి మరణించాడని వైద్యులు నిర్ధారించారు. కృష్ణారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, మృతుడి కుటుంబానికి యాజమాన్యం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కృష్ణారెడ్డి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

​ఘటనపై సమాచారం అందుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఈఈ వెంకన్న శుక్రవారం తన సిబ్బందితో కలిసి పరిశ్రమను సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, రియాక్టర్ పరిసరాలను పరిశీలించి, కార్మికులు, ఉద్యోగుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందిస్తామని ఈఈ వెంకన్న స్పష్టం చేశారు.