- అందెశ్రీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చిన ప్రజా ప్రభుత్వం!
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ‘అందెశ్రీ స్మృతి వనం’ శంకుస్థాపనలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక సారథి, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీకి తమ ప్రభుత్వం అపూర్వ గౌరవం ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో అందెశ్రీ అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశంలో ‘అందెశ్రీ స్మృతి వనం’ ఏర్పాటుకు, అలాగే ఆయన విగ్రహ ప్రతిష్ఠాపనకు జయంతి రోజైన శుక్రవారం నాడు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భూమి పూజ చేసి, పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ… సాధారణంగా నాయకులు లేదా ప్రభుత్వాలు ఒక కార్యక్రమం చేసి ఆ తర్వాత వదిలేస్తుంటాయని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అలా కాదని, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటుందని చాటిచెప్పారు. అందెశ్రీ దివంగతులైన వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన పాడె మోసి ఒక కవికి ఇవ్వాల్సిన అపూర్వమైన నివాళిని అర్పించి, తమకున్న గౌరవాన్ని చాటారని గుర్తు చేశారు. ఒక నిరుపేద దళిత కుటుంబంలో పెరిగి, రాష్ట్రం కోసం తపించిన ప్రజా గాయకుడికి ఈ ప్రభుత్వం సముచిత మర్యాదను అందించిందన్నారు. ఆనాడు అందెశ్రీ అంత్యక్రియల సమయంలో ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఏ ఐదు వాగ్దానాలనైతే ఇచ్చిందో, వాటిని మరచిపోకుండా, నేడు స్మృతివనానికి భూమి పూజ చేసే సమయానికే వాటన్నింటినీ నెరవేర్చిన ప్రజా ప్రభుత్వంగా నిలిచామన్నారు.
అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన కుమారుడు దత్తుకు బి.జె.ఆర్. డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకుడిగా (లెక్చరర్) ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించామని తెలిపారు. అలాగే అందెశ్రీ రచించిన ప్రసిద్ధ కవితా సంకలనం ‘నిప్పుల వాగు’ 20 వేల కాపీలను ప్రభుత్వ పరంగా ముద్రించి పంపిణీ చేసేందుకు విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, ఆ పనులను పురోగతిలో పెట్టామన్నారు. ఆయన అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశాన్ని స్మృతి వనంగా మారుస్తామని చెప్పిన విధంగానే నేడు ముఖ్యమంత్రి తో కలిసి భూమి పూజ నిర్వహించడంతో పాటు, అందెశ్రీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా సిఫార్సు కూడా చేయడం జరిగిందని వివరించారు. నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రతి ఒక్కరినీ కదిలించిన అందెశ్రీ కలం నుంచి జాలువారిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఏ కార్యక్రమం జరిగినా ఈ పాటను వినేలా మరియు వినిపించేలా ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తున్నదని వివరించారు. ”మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట ద్వారా మానవత్వం గురించి, సమాజం పట్ల మనిషి, నాయకులు ఏ రకంగా నడుచుకోవాలో యావత్ ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు అందెశ్రీ. ఆయన జీవితాన్ని, ఆలోచనలను, సాహిత్య సంపదను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.” అని పిలుపునిచ్చారు.