- పథకాలకే కాకుండా పాలనలో భాగస్వామ్యం
- స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం
- సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఘన సన్మానం
“మానత్వం మాటల్లో కాదు… అవకాశాల్లో కనిపించాలనే సంకల్పంతో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ట్రాన్స్జెండర్ సమాజానికి స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించే ప్రక్రియకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సామాజిక న్యాయానికి, రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ట్రాన్స్జెండర్ సమాజానికి గౌరవం, గుర్తింపు, నాయకత్వానికి నాంది పలుకుతోంది” అని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణకు చెందిన సుమారు 25 మంది ట్రాన్స్జెండర్ లు… ట్రాన్స్ ఉమెన్ హక్కుల ఉద్యమకారులు, ట్రాన్స్మెన్ హక్కుల ఉద్యమకారులు, ట్రాన్స్ హిజ్రా సంస్కృతి గురువులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల తో పాటు వివిధ ట్రాన్స్జెండర్ సంఘాల ప్రతినిధులు మంత్రిని కలిసి రాష్ట్ర కేబినెట్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరికి శాలువాతో సన్మానం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… ట్రాన్స్జెండర్ సమాజాన్ని సంక్షేమ పథకాలకే పరిమితం చేయకుండా పాలనలో భాగస్వాములను చేయాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించడం ద్వారా గ్రామాలు, మండలాలు, పట్టణాల అభివృద్ధిలో ట్రాన్స్జెండర్ ప్రతినిధుల స్వరం వినిపించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం పలు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. డ్రైవింగ్, వంట (కుకింగ్), డ్రోన్ నిర్వహణ వంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించడంతో పాటు, మెట్రో స్టేషన్లలో ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలో కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తుల సేవలను వినియోగిస్తూ వారికి గౌరవప్రదమైన జీవనోపాధి కల్పిస్తున్నామని చెప్పారు.
ఇప్పుడు స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించడం ద్వారా ట్రాన్స్జెండర్ సమాజానికి రాజకీయ సాధికారత కూడా కల్పిస్తున్నామని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచే నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ ప్రతినిధులు మాట్లాడుతూ… తమకు గౌరవప్రదమైన స్థానం కల్పించే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తమ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని, సమాజాభివృద్ధిలో మరింత బాధ్యతతో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు.
