- కేంద్రంతో పోరాడి ‘తాడిచర్ల 2’ సాధించాం
- కరెంట్ కష్టాలకు చెక్
- 108 తరహాలోనే ‘పవర్ అంబులెన్స్’ సేవలు
- ఎల్ నినో’ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరికలు
ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందించడమే కాకుండా, తెలంగాణకు మకుటాయమానమైన సింగరేణి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించిన ఆయన, ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లిలో మీడియాతో మాట్లాడారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచేలా, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా ప్రభుత్వం సరికొత్త పథకాలతో ముందుకు సాగుతోందని ప్రకటించారు. సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు తీవ్ర నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. ఉన్న బొగ్గు గనులు ఖాళీ అవుతున్నా.. కొత్త బ్లాకుల కేటాయింపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు. కొత్త గని ఆపరేషన్లోకి రావడానికి 5-6 ఏళ్లు పడుతుందని తెలిసి కూడా, గత ప్రభుత్వం కొత్త బ్లాకుల వేలంలో పాల్గొనకుండా కుట్రపూరితంగా వ్యవహరించిందని అన్నారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల సింగరేణి ఇప్పుడు ఇబ్బందుల్లో పడిందని విమర్శించారు. సింగరేణి కార్మికుల అకుంఠిత శ్రమ దీక్ష వల్లే సంస్థ బలంగా నిలబడిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాత ఫైళ్లన్నీ బయటకు తీసి సింగరేణి హక్కుల కోసం కేంద్రంతో పోరాడామని భట్టి స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం 2013లో తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ ను సింగరేణి కేటాయించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలకులు పదేళ్లుగా ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పడేశారని ఆయన విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా లీజ్ ఇవ్వకుండా అడ్డుపడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం కేంద్రంతో పోరాడి ఈ బ్లాక్‌ను సాధించామని చెప్పారు. ఒడిశాలో ఉన్న నాని బ్లాక్ పర్మిషన్ల కోసం తానే పర్సనల్‌గా అక్కడికి వెళ్లి ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్‌లు పూర్తి చేయించానని అన్నారు.
గత ప్రభుత్వం వేలానికి వెళ్లకపోవడం వల్లే సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని బొగ్గు గనులను 1/70 చట్టం ప్రకారం గిరిజనులు లేదా ప్రభుత్వ రంగ సంస్థలే చేపట్టాలని ఆయన అనాన్రు. ప్రైవేట్ వేలానికి వ్యతిరేకంగా కేంద్రంతో ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. సింగరేణిలో భూములు కోల్పోయిన నిర్వాసితులపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ.. భూమితో రైతుకు ఉండే భావోద్వేగ బంధాన్ని గౌరవిస్తూ, మానవతా కోణంలోనే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో 45 వేల మంది పర్మనెంట్, 35 వేల మంది కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ కార్మికులు జీవనం సాగిస్తున్నారని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సింగరేణి కార్మికులకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ₹1 కోటి ఇన్సూరెన్స్ పథకాన్ని తెచ్చామని, అనంతరం దీన్ని విద్యుత్ రంగ సంస్థలైన SPDCL, NPDCL, GENCO, TRANSCO లకూ వర్తింపజేశామన్నారు. ప్రస్తుతం ఈ రక్షణను మరింత పెంచి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ₹1.20 కోట్ల ఇన్సూరెన్స్ అందేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు పోడు భూముల పట్టాలు పొందిన గిరిజన రైతులు ఆత్మగౌరవంతో జీవించేలా, తమ భూముల్లో పసిడి పంటలు పండించుకునేందుకు ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద వ్యవసాయ అభివృద్ధి కోసం ఉచితంగా సౌర విద్యుత్ అందించడంతో పాటు బోర్ బావులు, పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వివరించారు. ప్రస్తుతం వర్షాకాలం (జూలై) అయినప్పటికీ వాతావరణంలో వచ్చిన అసాధారణ మార్పుల వల్ల విద్యుత్ వాడకం ఊహించని విధంగా పెరిగిందని భట్టి తెలిపారు. సాధారణంగా ఈ సీజన్లో 11,000 మెగావాట్లు ఉండాల్సిన పీక్ డిమాండ్, కేవలం ఒక్క వారం రోజుల్లోనే సడన్‌గా 50% పెరిగి 16,600 మెగావాట్లకు చేరిందని అన్నారు. మిడ్ సమ్మర్‌ను తలపించేలా ఈ డిమాండ్ ఉండటం చరిత్రలో ఎన్నడూ లేదన్నారు.
విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24 గంటలు పనిచేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. గతంలో కరెంట్ సమస్యల కోసం సబ్స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. వైద్యారోగ్య శాఖలో 108 తరహాలోనే విద్యుత్ శాఖలో పవర్ అంబులెన్స్ వ్యవస్థను తీసుకొచ్చామని అన్నారు. 1912 కి ఫోన్ చేయగానే.. ట్రాన్స్ఫార్మర్, వైర్లు, కట్టర్లు, నిచ్చెన వంటి సామాగ్రి, ఇంజనీర్లు, సిబ్బందితో కూడిన అంబులెన్స్ క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు పూర్తి చేస్తుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 165 పవర్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలవరం కలిగిస్తున్న ‘ఎల్ నినో’ వాతావరణ ప్రభావం దేశంతో పాటు తెలంగాణపై కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం మనుషులకే కాకుండా, అడవుల్లోని వన్యప్రాణులకు, జీవజాలానికి తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ ముప్పుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మీడియా మిత్రులు, బాధ్యతాయుత పౌరులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.