కేంద్ర ప్రభుత్వ నిధుల సమీకరణపై సిఎస్ సంజయ్ జాజు సమీక్ష

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధుల సమీకరణకు తగు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో సిఎస్ మాట్లాడుతూ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని సిఎస్ పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, నివేదికలు, ప్రతిపాదనలను సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని, తద్వారా కేంద్ర నిధులు విడుదల కావడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సిఎస్ గ్రూప్ కో ఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించి ఆర్థిక వనరుల సమీకరణ, శాఖల సమన్వయం, కేంద్ర, రాష్ట్ర సమన్వయంతో అమలు చేస్తున్న పథకాలు, నిధుల సమీకరణ పెంపొందించే చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగిషిప్ ప్రొగ్రామ్స్, సాధించిన పురోగతి, తదితర అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమీక్షలో శాఖల వారీగా పథకాల పురోగతిని సిఎం డ్యాష్ బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి వివరాలు, వాటి పురోగతి తదితర అంశాలన్నింటిని ఎప్పటికప్పుడు సిఎం డ్యాష్ బోర్డులో పొందుపరిచి, అంతర్గత అంశాలపై సమీక్షించుకోవాలని సూచించారు.రానున్న రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సమాయత్తం కావాలని అసెంబ్లీ ఎజెండా ప్రకారం సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని సిఎస్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మహేశ్ దత్ ఎక్కా, నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం, షీకా గోయల్, స్టీఫెన్ రవీంద్ర, కార్యదర్శలు ఇలంబర్తి, సురేంద్ర మోహన్, గౌరవ ఉప్పల్, సిక్తా పట్నాయక్, లోకేష్ కుమార్, రాజీవ్ గాంధీ హనుమంత్, కృష్ణ ఆదిత్య, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, ఐటి డిపార్లమెంట్ స్పెషల్ సెక్రెటరీ అనుదీప్, లా సెక్రెటరీ పాపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.