- రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్‌లోకి సింగరేణి విస్తరించాలి
- సింగరేణి భవిష్యత్తుకు అండగా ప్రజా ప్రభుత్వం
- బోగ్గే కాకుండా.. కొత్త రంగాల్లోకి సింగరేణి విస్తరించాలి
సింగరేణిని కాపాడుకోవడానికి, బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి అభివృద్ధి కోసం ప్రభుత్వం తలుపులు 24 గంటలూ తెరిచే ఉంటుందని భరోసా కల్పించారు. రాబోయే 15 – 20 ఏళ్లలో ఇంధన రంగం స్వరూప స్వభావాలు పూర్తిగా మారబోతున్నాయని ఆయన అన్నారు. సోలార్, పంప్డ్ స్టోరేజ్, విండ్, హైడ్రోజన్, రేర్ ఎర్త్ మినరల్స్, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు పెరిగితే, క్రమంగా థర్మల్ విద్యుత్ మరియు బొగ్గు వినియోగం తగ్గే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయాల వైపు చూడాలని చెప్పారు. కొత్తగూడెంలోని సింగరేణికి కార్యాలయంలో సింగరేణి, జెన్ కో ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు సింగరేణి ఆత్మ వంటిది. 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ఆయన అన్నారు. గతంలో ఉత్పత్తి రంగంలో సింగరేణిది ఏకఛత్రాధిపత్యం ఉండేదన్నారు. ఏ ధర నిర్ణయిస్తే, ఆ ధరకే వినియోగదారులు బొగ్గును కొనుగోలు చేసేవారని ఆ న్నారు. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ప్రైవేటీకరణ విపరీతంగా పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల బహిరంగ వేలం విధానాన్ని తీసుకురావడంతో అనేక ప్రైవేట్ సంస్థలు రంగంలోకి వచ్చాయని చెప్పారు. దీనితో ప్రభుత్వరంవ సంస్థలు ప్రైవేట్ వారితో పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ సంస్థలతో నాణ్యత, నిర్వహణా వ్యయాన్ని తగ్గించుకోవడం, ఉత్తమ సేవల్లో పోటీపడి సింగరేణి స్థానాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.
సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు నాణ్యత విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకూడదని అన్నారు. తవ్వకాల సమయంలో బొగ్గులో మట్టి, రాళ్లు కలవకుండా కఠినంగా పర్యవేక్షించాలని అధికారులకు ఆయన సూచనలు చేశారు. బొగ్గు శుద్ధీకరణకు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. వేర్వేరు గ్రేడ్ల బొగ్గును సరైన నిష్పత్తిలో బ్లెండింగ్ చేసి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందుచూపు, సుదీర్ఘ ప్రణాళికలు లేకపోవడం వల్ల సింగరేణి.. వేలంలో పాల్గొని నూతన బొగ్గు బ్లాకులను పొందకలేక పోయిందని అన్నారు. భద్రాద్రి, యాదాద్రి వంటి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో సరైన ప్రణాళికలు రూపొందించలేదని అన్నారు. వాటికి అవసరమయ్యే బొగ్గు బ్లాకులను కేటాయించుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ఒడిశాలోని నైనీ బ్లాక్, తాడిచర్ల-2 ప్రాజెక్టులపై ఉన్న భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వేగవంతం చేసి పరిష్కరించిందని అన్నారు. సింగరేణి అనేది కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు, వేలాది మంది కార్మిక కుటుంబాల జీవితమని అన్నారు. సంస్థ లాభాల్లో ఉంటేనే కార్మికుల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని అన్నారు. ప్రతి గని, మైన్ స్థాయిలో మేనేజ్మెంట్, కార్మిక సంఘాలు ప్రతి కార్మికుడితో ఓపెన్ చర్చలు ప్రారంభించాలని ఆన్నారు. సంస్థ మనుగడకు తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి అందరినీ భాగస్వాములను చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.
రాబోయే 15 – 20 ఏళ్లలో ఇంధన రంగం విపరీతంగా మారబోతోందన్నారు. సోలార్, పంప్డ్ స్టోరేజ్, విండ్, హైడ్రోజన్, రేర్ ఎర్త్ ఆధారిత బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు పెరిగే అవకాశం ఉండన్నారు. ఇవి పెరిగితే థర్మల్ విద్యుత్, బొగ్గు వినియోగం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సింగరేణి కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయాల వైపు చూడాలని అధికారులకు సూచనలు చేశారు. సెమీకండక్టర్స్, చిప్స్, ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల మైనింగ్ రంగానికి సింగరేణి విస్తరించాలన్నారు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో క్రూషియల్ మినరల్స్ వేలంలో సింగరేణి పాల్గొనాలని చెప్పారు. సింగరేణి వద్ద దశాబ్దాల అనుభవం కలిగిన నిపుణులైన ఇంజనీర్లు, మైనింగ్ కార్మికులు ఉన్నారని అన్నారు. ఈ అపారమైన మానవ వనరులను అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులకు ఉపయోగించాలన్నారు. ఇకపై బోర్డు సమావేశాలు కేవలం రొటీన్ పరిపాలనా అంశాలకే పరిమితం కాకుండా, సంస్థ విస్తరణ, రాబోయే 10 ఏళ్ల రోడ్మాప్పై సుదీర్ఘంగా చర్చించాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి సూచనలు చేశారు. కార్పొరేట్ సంస్థల మాదిరిగా టైమ్ లైన్ క్యాలెండర్ పెట్టుకుని లక్ష్యాలను పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధికారులకు దిశా నిర్దేశం చేశారు.