ధరణి అక్రమాలపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • అక్ర‌మాల బ‌ట్ట‌బ‌య‌లుకు ఫాస్ట్‌ట్రాక్ విచారణ
  • పేదల భూములు కాజేసిన వారిని వదిలిపెట్టం
  • నిషేధిత జాబితాలో కొత్తగా అంగుళం భూమి కూడా చేర్చలేదు
  • భూముల ధరల సవరణతో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ల ఆదాయం 20% వరకు పెరుగుదల
  • త్వ‌ర‌లో అసైన్డ్ భూములపై సమగ్ర విధాన నిర్ణయం
  • కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు చెల్లిస్తాం

హైదరాబాద్ : ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారిస్తున్నామని, అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టం ముందు నిలబెట్టడం ఖాయమని హెచ్చరించారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డుగా చేసుకుని భారీ స్థాయిలో భూ అక్రమాలు, అక్రమ మ్యుటేషన్లు, ప్రభుత్వ భూముల బదిలీలు జరిగాయని అన్నారు. ప్రస్తుతం ప్రతి వ్యవహారాన్ని ఆధారాలతో సహా పరిశీలిస్తున్నామని, నిజాలను ప్రజల ముందుంచుతామని తెలిపారు. అంతేగాక ఎవరి హయాంలో ఎంత భూమి నిషేధిత జాబితాలో చేరిందో తేలుస్తామ‌న్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు నిషేధిత జాబితాలో ఎంత భూమి ఉంది? ఆ భూములను ఎవరు, ఎప్పుడు, ఏ కారణాలతో చేర్చారు? తర్వాత ఎందుకు తొలగించారు? అనే ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా అదే స్థాయిలో పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.కొత్తగా ఒక్క సెంటు భూమి కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ధరణి పోర్టల్‌లో ఉన్న జాబితానే కోర్టుకు సమర్పించామని, వివాదాలు లేని ప్రైవేట్ ఆస్తులు లేదా ప్లాట్లను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే 276 గ్రామాల్లో సర్వే పూర్తైందని, ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ తరహాలో ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయిస్తామని చెప్పారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, కేవలం రెండు శాతం మాత్రమే అభ్యంతరాలు వచ్చాయని వివరించారు.
రాష్ట్రంలో సుమారు 85 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటి విషయంలో సమగ్ర విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని కోణాల్లో ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, ఎవరికీ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వ్యవహరించే ప్రశ్నే లేదని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ప్రతి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. క్యూర్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ను చూసి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. కొల్లూరులో గత ప్రభుత్వం నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లలో వర్షం వస్తే నీళ్లు కారుతున్నాయని మీడియా దృష్టికి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అది గత ప్రభుత్వ నాణ్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ ఇళ్లను కూడా మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా, లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఫైనల్ బిల్లులు చెల్లిస్తుందని మంత్రి ప్రకటించారు. భూముల మార్కెట్ విలువల సవరణ తర్వాత ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే 10 నుంచి 20 శాతం వరకు అధిక ఆదాయం వచ్చిందని మంత్రి తెలిపారు. స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ శాఖ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వార్షిక ఆదాయం సుమారు రూ.13 వేల కోట్లు ఉండగా, గత ఏడాది అది రూ.15 వేల కోట్లకు చేరిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు.