- అక్రమాలకు తావులేకుండా మార్కెటింగ్ శాఖను పారదర్శకంగా తీర్చిదిద్దాలి
- అభివృద్ది పనులన్నీ నిర్దేశించుకొన్న లక్ష్యం వరకు పూర్తి చేయాలి
- అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు 3 నెలల్లో పూర్తి చేయాలి
- కోహెడ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులలో మాసం వారి పురోగతి నిర్దేశించుకొని ముందుకెళ్లాలి.
- అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖను లక్ష్యం సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖపై శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖ పనితీరు, అభివృద్ధి పనులు, డిజిటలీకరణ, పత్తి కొనుగోళ్ల సన్నద్ధత, ఇంజినీరింగ్ పనులు, మార్కెట్ యార్డులలో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, ప్రత్యేక బృందాల తనిఖీలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలోని 206 మార్కెట్ కమిటీలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, టెండర్ ప్రక్రియలను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి, సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని సూచించారు. ప్రతి మార్కెట్ కమిటీలో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై అనుసంధానం చేయాలని ఆదేశించారు. రవాణా శాఖలో అమలవుతున్న నంబర్ ప్లేట్ స్కానింగ్ విధానాన్ని మార్కెట్ యార్డుల్లో కూడా అమలు చేసి, ప్రతి వాహనం ప్రవేశం, నిష్క్రమణ, తూకం, లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో నమోదయ్యేలా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ఐటీ విభాగానికి సూచించారు. ఇకపై మార్కెటింగ్ శాఖలో జరిగే అన్ని కొనుగోళ్లు పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఇటీవల ఏర్పాటు చేసిన ఏడు ప్రత్యేక తనిఖీ బృందాలు ఈ వారం నిర్వహించిన తనిఖీలపై వచ్చే సోమవారం లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా మార్కెటింగ్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బృందాల పనితీరుకు వారంవారీ టైమ్‌బౌండ్ వ్యవస్థ అమలు చేయాలని స్పష్టం చేశారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్‌కు ముందుగానే సమగ్ర సన్నద్ధత అవసరమని పేర్కొన్న మంత్రి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI), జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు, సంబంధిత అధికారులతో ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. గత రెండు సంవత్సరాల్లో విజిలెన్స్ విభాగం గుర్తించిన లోపాలను దృష్టిలో ఉంచుకొని, గతంలో జరిగిన అక్రమాలకు ఎటువంటి అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర (MSP) ప్రయోజనం పూర్తిగా రైతులకే అందేలా చర్యలు చేపట్టాలని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా కొనుగోలు చేసే ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, లిఫ్టర్లు వంటి పరికరాలను కొనుగోలు చేసే ముందు సాంకేతిక పరీక్షలు నిర్వహించి, అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయా పరికరాలు నిజంగా అవసరమైన జిల్లాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని, ఉపయోగం లేకుండా పరికరాలు కొనుగోలు చేసి మూలన పడేస్తే సంబంధిత కార్యదర్శి, జిల్లా మార్కెటింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మార్కెటింగ్ శాఖలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ పనులన్నింటికీ స్పష్టమైన గడువులు నిర్ధారించి, ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. శాఖలో ఇంజినీరింగ్ సిబ్బంది కొరత వల్ల పనులు ఆలస్యం అయితే, అవసరమైతే ఆ పనులను ఆర్ అండ్ బి (R&B), పంచాయతీరాజ్ (PR) శాఖలకు అప్పగించి వేగవంతంగా పూర్తి చేయాలని ఏపీసీకి సూచించారు. శాఖకు కేటాయించిన ఇంజినీర్లు విధులకు హాజరుకాకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి పనికి టైమ్‌బౌండ్ కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డుల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఇతర సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయడాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. వచ్చే నెలలోగా అన్ని మార్కెట్ కమిటీల నుంచి ఫీజిబిలిటీ నివేదికలు సేకరించి, సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించి, నవంబర్ నాటికి అన్ని మార్కెట్ యార్డులు, గోదాముల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోహెడ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ఏజెన్సీ తయారుచేసిన డిజైన్లను వచ్చే వారంలోగా ఖరారు చేసి, ముఖ్యమంత్రి గారి అనుమతితో వచ్చే నెలలో నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెటింగ్ శాఖలో ఇంజినీరింగ్, పరిపాలన విభాగాల్లో ఎక్కడ సిబ్బంది కొరత ఉందో వెంటనే గుర్తించి, అదనపు పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. శాఖ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేసి, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ రోజు సచివాలయంలో వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆయిల్ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శాంభరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు మంత్రి చేపడుతున్న చర్యలను రైతు నాయకులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలు సకాలంలో అందుబాటులో ఉండేలా కంపెనీలను ఆదేశించాలని, అవసరమైన ఎరువులు, ఇతర వ్యవసాయ సామగ్రిని ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా తక్కువ ధరలకు సరఫరా చేయాలని కోరారు. అలాగే ఆయిల్ పామ్ తోటలలో విద్యుత్ వైర్ల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి మండలంలో కనీసం ఒక ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆయిల్ పామ్ రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని, కార్మికుల కొరతను అధిగమించేందుకు యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించాలని, కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆయిల్ పామ్ రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని, ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అధికారులు, కంపెనీలు, రైతులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రాంతం దేశంలోనే ఆయిల్ పామ్ సాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఆయిల్ పామ్ అధిక ఆదాయం అందించే పంట అని, దీనికి మార్కెటింగ్ సమస్యలు లేవని, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కూడా తక్కువగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉందన్నారు. రైతులు కోరిన వెంటనే నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచేలా ఆయిల్ పామ్ కంపెనీలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.