ఖేలో ఇండియా క్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

  • కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో తెలంగాణ ప్రతినిధుల భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గురువారం న్యూఢిల్లీలో కలిశారు. ఆయనతోపాటు తెలంగాణ ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె. శివసేన రెడ్డి ఉన్నారు. తెలంగాణకు ఖేలో ఇండియా క్రీడలను కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాసిన ఆహ్వాన లేఖను కేంద్ర మంత్రి మాండవీయకు అందజేశారు. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు 12 రోజులపాటు తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖేలో ఇండియా క్రీడలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి పేర్కొన్నారు. నిర్వహణలో ఎలాంటి లోపాలు, విమర్శలకు తావులేకుండా అత్యున్నత ప్రమాణాలతో పోటీలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమయం తీసుకుని, ఖేలో ఇండియా క్రీడల ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానిస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి, విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో క్రీడారంగాన్ని ముందుకు తీసుకెళ్తోందని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని తెలిపారు. అందరి సహకారంతో ఖేలో ఇండియా క్రీడలను విజయవంతంగా నిర్వహించి తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచుతామని పేర్కొన్నారు.