ఎల్‌నినో వేళ ప్రతి నీటి చుక్కకూ లెక్క ఉండాలి: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • తాగునీటికే తొలి ప్రాధాన్యం… పంటలకూ భరోసా కల్పించాలి
  • ఆశలపై కాదు… అందుబాటులోని జలాల ఆధారంగానే విడుదల నిర్ణయాలు
  • కృష్ణా బేసిన్‌లో 76.63 శాతం.. గోదావరి బేసిన్‌లో 68.1 శాతం నిల్వలు
  • నాగార్జునసాగర్‌లో 164 టీఎంసీల నీరు — ఇంకా 47 శాతం వరద జలాలకు అవకాశం
  • సింగూరు మరమ్మతులకు అత్యధిక ప్రాధాన్యం
  • అంతర్రాష్ట్ర జల వివాదాలపై పటిష్ట వాదనకు సమగ్ర కార్యాచరణ

హైదరాబాద్ : ఆకాశం వైపు ఆశగా చూడటం ఒక్కటే జల నిర్వహణ కాదు… ఆనకట్టలో ఎంత నీరుంది, అందులో నిజంగా వినియోగించగలిగేది ఎంత, తాగునీటికి ఎంత కాపాడాలి, నిలువునా ఉన్న పంటకు ఎంత అందించగలం అన్న ప్రతి లెక్కలో శాస్త్రీయత, వాస్తవికత ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన వర్షాకాలంపై అనిశ్చితి కొనసాగుతున్నందున “తాగునీటి భద్రతకు తొలి ప్రాధాన్యం… అదే సమయంలో అందుబాటులో ఉన్న నీటితో ఖరీఫ్ పంటలకు గరిష్ఠ రక్షణ” అనే సూత్రంతో ముందుకు సాగాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం జలసౌధలో రాష్ట్రంలోని జలాశయాల నీటిమట్టాలు, ప్రవాహాలు, మిగిలిన ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి అవకాశాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీగా వర్షాలు కురుస్తాయని, ఎగువ నుంచి పెద్దఎత్తున వరదలు వస్తాయని ముందుగానే ఊహించుకొని నీటి నిర్వహణ ప్రణాళికలు రూపొందించడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న నీరే ప్రామాణికం కావాలి… నమ్మదగిన ప్రవాహాలే అంచనాలకు ఆధారం కావాలి… వర్షపాతంపై శాస్త్రీయ విశ్లేషణే నిర్ణయాలకు దిక్సూచి కావాలి అని స్పష్టం చేశారు.

“మన విధానం సమతుల్యంగా, వివేకవంతంగా ఉండాలి. ప్రజల తాగునీటి అవసరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదంలోకి నెట్టకూడదు. అదే సమయంలో తాగునీటి అవసరాలకు మించి అందుబాటులో ఉన్న నీరు జలాశయాల్లో ఉన్నప్పుడు పంటలు ఎండిపోతుంటే చూస్తూ ఉండకూడదు. ప్రతి నీటి విడుదల నిర్ణయం వాస్తవంగా వినియోగించగల నిల్వలు, నమ్మదగిన ప్రవాహాలు, వాస్తవిక వర్షపాత అంచనాల ఆధారంగానే జరగాలి” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రధాన జలాశయాల్లో మొత్తం 973.68 టీఎంసీల సామర్థ్యానికి గాను 746.12 టీఎంసీల నీరు ఉండి, 76.63 శాతం నిల్వలు నమోదయ్యాయని సమీక్షలో వెల్లడైంది. గోదావరి బేసిన్‌లో 306.20 టీఎంసీల సామర్థ్యానికి 208.38 టీఎంసీలు, అంటే 68.1 శాతం నీరు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు.

కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం సుమారు 164 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు స్థూల సామర్థ్యం సుమారు 312 టీఎంసీలు కాగా, ఇంకా దాదాపు 47 శాతం మేర వరద జలాలను స్వీకరించే అవకాశం ఉందని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న నేపథ్యంలో సాగునీటి అవసరాలను అత్యంత జాగ్రత్తగా అంచనా వేయాలని మంత్రి సూచించారు. అయితే జలాశయాల్లో కనిపించే స్థూల నిల్వ శాతాలను మాత్రమే చూపించి పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉందన్న భావన కలిగించవద్దని అధికారులను మంత్రి హెచ్చరించారు. స్థూల సామర్థ్యం ఎంత? లైవ్ స్టోరేజ్ ఎంత? వాస్తవంగా వినియోగించగల నీరు ఎంత? ఇప్పటికే కేటాయించిన అవసరాలు ఎంత? వాటన్నింటినీ మినహాయించిన తర్వాత సాగునీటికి మిగిలేది ఎంత? అన్న వివరాలు ప్రతి నివేదికలో స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. 2025, 2026 సంవత్సరాల నిల్వలు, ప్రవాహాలను తులనాత్మకంగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన ఖరీఫ్ కాలంలో ప్రభుత్వం ముందున్న లక్ష్యం స్పష్టమని మంత్రి పేర్కొన్నారు. నమ్మదగిన ప్రతి నీటి వనరును సద్వినియోగం చేసుకొని నిలువునా ఉన్న పంటలను కాపాడాలని, ప్రవాహాలపై అనిశ్చితి ఉన్న జలాశయాల్లో నీటిని జాగ్రత్తగా సంరక్షించాలని, రైతులకు వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు పారదర్శకంగా తెలియజేయాలని ఆదేశించారు.

వైరా రిజర్వాయర్ పరిస్థితిని ప్రత్యేకంగా సమీక్షించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, గోదావరి జలాలతో తిరిగి నింపుకునే అవకాశం ఉన్నప్పుడు సాగునీటి విడుదలలో జాప్యం ఎందుకు జరుగుతోందని అధికారులను ప్రశ్నించారు. సహజ ప్రవాహాలపై మాత్రమే ఆధారపడే జలాశయాల్లో నీటిని పొదుపుగా వినియోగించడం అవసరమేనని, కానీ నమ్మదగిన ప్రత్యామ్నాయ వనరుల నుంచి తిరిగి నింపుకునే అవకాశం ఉన్న చోట సాగునీటిని అనవసరంగా నిలిపివేయడం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. దేవాదుల, నిజాంసాగర్, స్వర్ణ, సదర్మట్ ఆనకట్ట, రామడుగు, బుగ్గలవాగు, రామపల్లి, పాలెంవాగు, గౌరవవరం, పోచారం, రాజీవ్ సాగర్, నెలవాయి, వట్టివాగు, నల్లవాగు, పాల్వాయి పురుషోత్తంరావు (ఎర్రవాగు), చెల్మెలవాగు (ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టుల పరిధిలో అందుబాటులో ఉన్న నీటి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, సాగునీటి విడుదలకు అవకాశం ఉన్నచోట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మూసీ జలాలను కూడా సమర్థంగా వినియోగించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని సూచించారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో సాగునీటి ప్రణాళికలు జలాశయంలోని వాస్తవ నిల్వలు, వస్తున్న ప్రవాహాలకు అనుగుణంగానే ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. నిజాంసాగర్, లోయర్ మానేరు డ్యామ్, సింగూరు సహా గోదావరి బేసిన్‌లోని ఇతర ప్రధాన జలాశయాల పరిస్థితిని కూడా సమగ్రంగా సమీక్షించారు. సింగూరు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్యామ్‌కు అవసరమైన మరమ్మతులు, పటిష్టీకరణ పనులను వేగవంతం చేయాలని, తాజా నీటి నిల్వలను మరోసారి ధ్రువీకరించి సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇంజినీర్లకు సూచించారు.

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. ఇన్‌లెట్, అవుట్‌లెట్ రెండు వైపుల నుంచి తవ్వకం కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఇంజినీర్లు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, భద్రత విషయంలో ఎక్కడా రాజీపడకుండా పనుల వేగాన్ని పెంచాలని మంత్రి ఆదేశించారు. జలవనరులకు సంబంధించిన అన్ని సాంకేతిక అధ్యయనాల్లో కేంద్ర జల సంఘం (CWC), భారత వాతావరణ శాఖ (IMD) తాజా సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాలం చెల్లిన సమాచారంపై ఆధారపడకుండా నదుల క్రాస్ సెక్షన్లను తాజా పరిస్థితులకు అనుగుణంగా నవీకరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఏర్పడే అవకాశం ఉన్న ముంపు ప్రభావంపై అధ్యయనం చేస్తున్న ఐఐటీ నిపుణులతో త్వరితగతిన తదుపరి సంప్రదింపులు జరపాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ భూభాగంలో ఎంతమేర వరద ప్రభావం లేదా ముంపు ఏర్పడే అవకాశం ఉందన్న అంశంపై శాస్త్రీయమైన, తిరుగులేని సాంకేతిక ఆధారాలను సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైన రక్షణ చర్యలను కేంద్రం నుంచి కోరేందుకు ఈ అధ్యయనం తెలంగాణకు బలమైన ఆధారంగా నిలవాలని పేర్కొన్నారు.

అంతర్రాష్ట్ర జల వివాదాలపై కూడా మంత్రి విస్తృతంగా సమీక్షించారు. ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న విచారణలు, సుప్రీంకోర్టులోని కేసులు, కృష్ణా జలాల నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి తదితర అంశాలపై ఇంజినీరింగ్, న్యాయ విభాగాల అధికారులు సమన్వయంతో సంక్షిప్తమైనా సమగ్రమైన నోట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. “నీరు ప్రకృతి ఇచ్చే సంపద మాత్రమే కాదు… ప్రజల భవిష్యత్తుకు ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యత. తాగునీటిని కాపాడాలి… రైతు పంటను నిలబెట్టాలి… రేపటి అవసరాన్ని విస్మరించకుండా నేటి అవసరాన్ని తీర్చాలి. అందుకే ఈ సమయంలో ప్రతి టీఎంసీకి లెక్క ఉండాలి… ప్రతి విడుదలకు శాస్త్రీయ కారణం ఉండాలి… ప్రతి నిర్ణయంలో రైతు ప్రయోజనం, ప్రజల తాగునీటి భద్రత ప్రతిబింబించాలి” అన్న దిశలో అధికారులు పనిచేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) ఓ.వి. రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఇంజినీర్-ఇన్-చీఫ్ (అడ్మినిస్ట్రేషన్) టి. శ్రీనివాస్, ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఓ అండ్ ఎం, క్వాలిటీ కంట్రోల్) ఆర్. మధుసూదన్ రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.