ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలా లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యుల బృందం గురువారం సందర్శించింది. విదేశాంగ శాఖ అధికారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపింది. ఫిలిప్పీన్స్ దేశం విదేశాలలో పనిచేసే ప్రవాసుల కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను అత్యుత్తమ విధానాలను తెలంగాణ బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బృందానికి సారథ్యం వహిస్తున్న కమిటీ ఛైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి గల్ఫ్ కార్మికులకు ఎలా అండగా ఉండాలి అన్న అంశాలపై ఫిలిప్పీన్స్ అధికారులతో విపులంగా చర్చించారు. ఫిలిప్పీన్స్ దేశంలో అమలు చేస్తున్న వలస కార్మికుల విధానాన్ని, తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో నివాసం ఉంటున్న సుమారు 15 లక్షల మంది కార్మికులకు అండగా ఉండేందుకు త్వరలో ఒక విధానాన్ని రూపొందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆది శ్రీనివాస్, డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి తెలిపారు. ఫిలిప్పీన్స్ దేశ పర్యటనలో భారత విదేశాంగ శాఖ ఫస్ట్ సెక్రటరీ నీలేష్ కుమార్ రాయ్ ఈ బృందానికి సంపూర్ణ సహకారాన్ని అందించారు.