ఏసీబీ అధికారుల వలలో మరో ఉన్నతాధికారి చిక్కారు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అతడి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు చేపట్టారు. ఆస్తులు, నగదు, బంగారంపై శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు. ఈ సమయంలో కూడా ఆయనపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.