‎బంగారం మైనింగ్ లో హట్టి- సింగరేణి జతకట్టాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

  • ‎భవిష్యత్తు ప్రాజేక్టుల్లో జాయింట్ వెంచర్ గా కలిసి పని చేయడానికి పరిశీలన చేయాలి
  • ‎‎సింగరేణి అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశ నిర్ధేశం
  • ‎‎బంగారం శుద్ధి కేంద్రం పరిశీలన, హట్టి, యుటీ బంగారు గనులలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విస్తృత పర్యటన.

‎బంగారం మైనింగ్‌లో విశేష అనుభవమున్న కర్ణాటక ప్రభుత్వ సంస్థ హట్టి గోల్డ్‌ మైన్స్‌తో సింగరేణి కలిసి పనిచేసేలా జాయింట్‌ వెంచర్‌ అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. రెండు ప్రభుత్వ రంగ సంస్థల సాంకేతిక సామర్థ్యం, అనుభవాన్ని సమన్వయం చేస్తే దేశీయ బంగారం ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
‎కర్ణాటక గోల్డ్‌ మైన్స్‌ ప్రాంతంలో రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం రాయచూర్‌ జిల్లాలోని హట్టి, యూటి  బంగారు గనులను ఉప ముఖ్యమంత్రి సందర్శించారు. బంగారు ఖనిజం తవ్వకం నుంచి శుద్ధ బంగారం తయారీ వరకు చేపడుతున్న ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించారు. ‎హట్టి గోల్డ్‌ మైన్స్‌కు బంగారం అన్వేషణ, తవ్వకం, ప్రాసెసింగ్‌, శుద్ధిలో అపార అనుభవం ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. బొగ్గు, ఇతర ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో సింగరేణికి ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని హట్టి అనుభవంతో జోడించాలని సూచించారు.
‎బంగారం అన్వేషణ, తవ్వకం, వెలికితీత, శుద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగం, నిపుణుల సేవలు, మానవ వనరుల శిక్షణ తదితర అంశాల్లో రెండు సంస్థలు సంయుక్తంగా పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. 
‎ 
‎ఆర్థిక భద్రతలో బంగారం కీలకం
‎దేశ ఆర్థిక భద్రతలో బంగారం కీలక పాత్ర పోషిస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న బంగారు ఖనిజ వనరులను శాస్త్రీయంగా అన్వేషించి వెలికితీయడంలో సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుండాలన్నారు. ‎బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హట్టి–సింగరేణి భాగస్వామ్యంతో బంగారం ఉత్పత్తి పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, స్థానిక ఉపాధి కల్పనతోపాటు దేశ ఆర్థికాభివృద్ధికి మేలు జరుగుతుందని తెలిపారు.

‎ఉత్పత్తి నుంచి శుద్ధి వరకు పరిశీలన
‎హట్టి గోల్డ్‌ మైన్స్‌లోని ప్రొడక్షన్‌ యూనిట్‌, ఖనిజ శుద్ధి కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్‌ కేంద్రాలను ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. గని నుంచి వెలికితీసిన ఖనిజాన్ని వివిధ దశల్లో ప్రాసెస్‌ చేసి శుద్ధ బంగారంగా మార్చే విధానాన్ని అధికారులు వివరించారు. హట్టి ప్రాజెక్టు ద్వారా రోజుకు సగటున రెండు నుంచి నాలుగు కిలోల బంగారం ఉత్పత్తి అవుతోందని అధికారులు తెలిపారు. ‎’యూటి ఓపెన్ కాస్ట్ గోల్డ్ మైన్’ వ్యూ పాయింట్ వద్ద నిలబడి బంగారం ముడి మట్టిని వెలికి తీసిన ప్రక్రియను, సేకరించిన ప్రదేశాలను ఆయన ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ గనిలో ఎంత లోతు నుంచి బంగారం తయారీకి కావలసిన ముడి సరుకును తీశారనే వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బంగారం ఖనిజ గనికి సంబంధించిన సమగ్ర మ్యాప్‌లను లోతుగా పరిశీలించారు. బంగారు ఖనిజ అన్వేషణకు ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారని అధికారులను అడిగారు. అక్కడి అధికారులు డిప్యూటీ సీఎంతో మొక్కను నాటించారు.అనంతరం యుటీ భూ గర్భ గనిలో జరుగుతున్న బంగారు ఖనిజ తవ్వకాలను పరిశీలించారు.భూగర్భ గనిలో ఖనిజం తవ్వకం, రవాణా, యంత్రాల వినియోగం, కార్మికుల భద్రత తదితర అంశాలను ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ‎ఈ పర్యటనలో సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధ ప్రకాష్‌ జ్యోతి, ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, జనరల్‌ మేనేజర్‌ పంకజ్‌ కులశ్రేష్ఠ, రాయచూరు జిల్లా పరిషత్ సభ్యులు అమ్జద్, హట్టి గోల్డ్‌ మైన్స్‌ ఉన్నతాధికారులు అరుణవ ఘోష్, సఫీయుల్లా ఖాన్, విధాత్రి ఉపుండ, యెమ్నూరప్ప గౌడ ‎రిటైర్డ్ కల్నల్ దస్తగిరిసాహెబ్ దఫేదార్ పాల్గొన్నారు.