మైనింగ్ ఏడీ జయరాజు అక్రమాస్తులు 100 కోట్లకు పైనే..!

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ACB కి పట్టుబడ్డ గనుల శాఖ ఏడీ జయరాజు
  • ఏకకాలంలో 12 చోట్ల అధికారుల సోదాలు
  • అవినీతి సొమ్ముతో హైదరాబాద్ లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు
  • ఇటీవలే ఉత్తమ అధికారి అవార్డు.. ఇంతలోనే ఏసీబీ దాడులు
  • కారు డ్రైవర్ ఖాతాలో రూ.24 లక్షలు

హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భగనులశాఖ ఏడీ (సహాయ సంచాలకుడు, గనులు, భూగర్భశాఖ) బొజ్జ జయరాజ్ కు సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలు, బంధువులు, స్నేహితుల ఇండ్లలో ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సుమారు రూ.100 కోట్ల విలువ చేసే ఆస్తులు గుర్తించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయిమనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్ నగర్ కాలనీలో జయరాజ్ నివాసం, సూర్యాపేట, తాండూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని జిల్లా భూగర్భగనుల శాఖ కార్యాలయం, జయరాజ్ బంధువుల ఇండ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరితో జయరాజ్ కుమ్మక్కయ్యా రన్న ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే కోణంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో అధికారిక రికార్డుల ప్రకారం లభ్యమైన ఆస్తుల విలువ రూ. 3,06,53,177 ఏసీబీ తేల్చింది. మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.60 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ వర్గాలు తెలిపాయి.

ఇటీవలే ఉత్తమ అధికారి అవార్డు.. ఇంతలోనే ఏసీబీ దాడులు
భూగర్భ గనులశాఖ ఏడీ బొజ్జ జయరాజ్ ఇటీవల నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న కొద్దిరోజుల వ్యవధిలోనే ఏసీబీ అధికారులు సోదా చేయడం కలకలం రేపింది. ఆయన ఇంటితోపాటు బంధువుల ఇండ్లు, ఆయనకు సంబంధించిన 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు జరుపడంతో జిల్లాలోని ఇతర శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో టెన్షన్ నెలకొన్నది. అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జయరాజ్ కు సంబంధించిన ఆస్తుల కొనుగోళ్లు, వాటి విలువ, ఆదాయ వనరులు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, ఇండ్లు, కార్యాలయాలు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విచారణలో మరో సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడి డ్రైవర్ సత్తునూరి యాదయ్య మొబైల్ ఫోన్ వివరాలను పరిశీలించగా, అతని బ్యాంక్ ఖాతా నుంచి జయరాజ్ కుమార్తె ఖాతాకు దాదాపు రూ.24.80 లక్షలు బదిలీ అయినట్టు ఏసీబీ గుర్తించింది. ఇసుక దందాతో సంబంధం ఉన్న వ్యక్తుల నుంచి ఈ సొమ్ము వసూలు చేసినట్టు డ్రైవర్ అంగీకరించాడని అధికారులు తెలిపారు.

డ్రైవర్ అకౌంట్లో రూ.24 లక్షలు..
సోదాలు చేస్తున్న సమయంలో జయరాజు వ్యక్తిగత డ్రైవర్ సత్తునూరి యాదయ్య ఫోన్ ను కూడా ఏసీబీ అధికారులు పరిశీలించారు. దీనిలో డ్రైవర్ బ్యాంక్ అకౌట్ నుంచి జయరాజు కుమార్తెకు రూ.24.80 లఖలు బదిలీ చేసినట్లు గుర్తించారు. వీటిపై అరా తీయగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ ఇసుక రవాణా తో పాటు పలువురు వ్యక్తుల నుంచి జయరాజు వసూలు చేసిన డబ్బులను డ్రైవర్ యాదయ్యకు బదిలీ చేయించారు. అనంతరం అతడి అకౌంట్ నుంచి తన కుమార్తె ఖాతాకు బదిలీ చేయించుకున్నారు.

ఏసీబీ గుర్తించిన ఆస్తులివే..
* బోడుప్పల్ (హైదరాబాద్) లో రూ.40లక్షల విలువైన జీ+2 భవనం
* కేపీహెచ్ బి కాలనీ(హైదరాబాద్)లో సుమారు రూ.32.81లక్షల విలువైన ఫ్లాట్
* కీసర, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటల్లో సుమారు రూ.15,77,469 విలువైన 5 ప్లాట్లు
* సుమారు రూ.8 లక్షల విలువైన 3.21 ఎకరాల వ్యవసాయ భూమి
* రూ.40 లక్షల విలువైన మూడు కార్లు, రెండు బైక్ లు
* సీజ్ చేసిన నగదు రూ.10,03,640
* బ్యాంక్ బ్యాలెన్సులు(3 ఖాతాల్లో) సుమారు రూ.71,27,619
* రూ.37,23,430 విలువైన 629 గ్రాముల బంగారు ఆభరణాలు
* ఎల్ఐసీ, మ్యాక్స్ లైఫ్ పొదుపు మొత్తం రూ.19,86,104
* పోస్టాఫీస్ సేవింగ్స్ సుమారు రూ. 20,86,175
* గృహోపకరణ వస్తువులు రూ.10,67,740