ఖరీఫ్ ఎరువుల పంపిణీ విజయవంతం, పకడ్బందీగా ఎరువుల సరఫరా: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • ఖరీఫ్‌లో రాష్ట్ర యాప్ ద్వారా 33.39 లక్షల మంది రైతులకు 128.18 లక్షల యూరియా బస్తాలు, కేంద్ర యాప్ ద్వారా 37.48 లక్షల మంది రైతులకు 104.99 లక్షల అన్ని రకాల ఎరువుల బస్తాల పంపిణీ
  • రైతులకు ఇబ్బందులు రావొద్దని ముందుగానే ఎరువుల అడ్వాన్స్‌ పొజిషనింగ్‌.. షిప్‌యార్డుల్లో ప్రత్యేక అధికారుల నియామకం
  • ఫార్మర్స్‌ రిజిస్ట్రీలో తెలంగాణ ముందంజ.. భవిష్యత్‌లో అన్ని పథకాలకు డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ ప్రాతిపదిక
  • రాష్ట్రంలో ప్రస్తుతం 2.33 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు.. గత ఏడాదితో పోలిస్తే భారీ పెరుగుదల
  • గత ఖరీఫ్ తో పోల్చుకుంటే 35 వేల టన్నుల వాడకం తక్కువ

ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా ముందస్తుగానే ఎరువులను పొజిషన్‌ చేయడం, షిప్‌మెంట్లను వేగంగా రాష్ట్రానికి తీసుకురావడం, ఫెర్టిలైజర్‌ యాప్‌ ద్వారా పంపిణీని పర్యవేక్షించడం వంటి చర్యలతో ఎరువుల పంపిణీని సక్రమంగా నిర్వహించామని మంత్రి పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందుగానే ఎరువుల లభ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా ముందస్తుగానే స్టాక్స్‌ను పొజిషన్‌ చేయడంతో పాటు, దిగుమతి చేసుకునే ఎరువుల విషయంలో షిప్‌యార్డుల వద్ద ప్రత్యేక అధికారులను నియమించి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేశామని చెప్పారు. షిప్‌మెంట్లు ఆలస్యం కాకుండా సంబంధిత అధికారులను సమన్వయం చేస్తూ, షిప్‌యార్డుల నుంచి రాష్ట్రానికి ఎరువులు త్వరితగతిన చేరేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
 
ఫెర్టిలైజర్‌ యాప్‌తో పంపిణీలో పారదర్శకత…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫెర్టిలైజర్‌ యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి, ఎరువుల పంపిణీ ప్రక్రియను డిజిటల్‌ విధానంలోకి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. ఈ విధానం ద్వారా ఎక్కడ ఎంత ఎరువుల నిల్వ ఉంది.. ఎంత పరిమాణంలో బుకింగ్‌ జరిగింది.. ఎంత మేరకు రైతులు ఎరువులను కొనుగోలు చేశారు అనే వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఏర్పడిందన్నారు. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యూరియా యాప్‌ను సమర్థవంతంగా అమలు చేసి, ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయడంలో విజయం సాధించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో యూరియా పంపిణీని పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన యూరియా యాప్‌ విజయవంతమైన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు జాతీయ ఫెర్టిలైజర్‌ యాప్‌ను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. అయితే జాతీయ ఫెర్టిలైజర్‌ యాప్‌ ప్రారంభ దశలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని మంత్రి చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాల మ్యాపింగ్‌ పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడక్కడా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఈ సమస్యలను పరిష్కరించే చర్యలు చేపట్టామని చెప్పారు. మొత్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎరువుల పంపిణీ సంతృప్తికరంగా జరిగిందని, రైతులకు అవసరమైన ఎరువులు నేరుగా, సక్రమమైన విధానంలో అందేలా యాప్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టామని మంత్రి తెలిపారు.
 
రాష్ట్ర, కేంద్ర యాప్‌ల ద్వారా పకడ్బందీగా ఎరువుల పంపిణీ..
ఖరీఫ్‌-2026 సీజన్‌లో ఫెర్టిలైజర్‌ యాప్‌ ద్వారా 33.39 లక్షల మంది రైతులు ఎరువుల కోసం నమోదు చేసుకోగా, 142.08 లక్షల బస్తాలు బుక్‌ అయ్యాయని మంత్రి తెలిపారు. ఇందులో ఇప్పటికే 128.18 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారు. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న FFS (Fertilizer Facilitation System) యాప్‌ ద్వారా 37.48 లక్షల QR కోడ్‌లు జనరేట్‌ కాగా, 141.88 లక్షల అన్ని రకాల ఎరవుల బస్తాలు బుక్‌ అయ్యాయి. ఇందులో 104.99 లక్షల బస్తాలను రైతులు కొనుగోలు చేశారన్నారు.

గత మూడేళ్లతో పోలిస్తే వానాకాలం ఎరువుల విక్రయాల వివరాలు…
2024-25 వానాకాలంలో యూరియా 9.66 లక్షల మెట్రిక్‌ టన్నులు, DAP 2.17 లక్షల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 8.59 లక్షల మెట్రిక్‌ టన్నులు, MOP 0.47 లక్షల మెట్రిక్‌ టన్నులు, SSP 0.32 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. 2025-26 వానాకాలంలో యూరియా 9.79 లక్షల మెట్రిక్‌ టన్నులు, DAP 2.38 లక్షల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 8.97 లక్షల మెట్రిక్‌ టన్నులు, MOP 0.43 లక్షల మెట్రిక్‌ టన్నులు, SSP 0.34 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. 2026-27 వానాకాలంలో యూరియా 9.44 లక్షల మెట్రిక్‌ టన్నులు, DAP 2.98 లక్షల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 7.09 లక్షల మెట్రిక్‌ టన్నులు, MOP 0.49 లక్షల మెట్రిక్‌ టన్నులు, SSP 0.48 లక్షల మెట్రిక్‌ టన్నులు విక్రయాలు కోనుగోలు చేశారు అన్నారు. ఈ ఖరీఫ్ లో పూర్తిగా యాప్ ద్వారా యూరియా మరియు ఎరువులు పంపిణీ చేయడంతో బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు తగ్గి, గత ఖరీఫ్ కంటే 35 వేల టన్నుల యూరియాను తక్కువగా వాడినట్టు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు
రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. యూరియా 2.33 లక్షల మెట్రిక్‌ టన్నులు నిల్వ ఉండగా, గత ఏడాది ఇదే సమయంలో కేవలం 0.50 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత యూరియా నిల్వలు గణనీయంగా మెరుగ్గా ఉన్నాయన్నారు. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో DAP 0.39 లక్షల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 2.72 లక్షల మెట్రిక్‌ టన్నులు, MOP 0.36 లక్షల మెట్రిక్‌ టన్నులు, SSP 0.18 లక్షల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అక్టోబర్‌లో 2 లక్షల LMTల యూరియా సరఫరా లక్ష్యం
అక్టోబర్‌ నెలకు రాష్ట్రానికి మొత్తం 2.00 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా ప్రణాళిక ఉండగా, ఇప్పటివరకు 0.18 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా అయినట్లు మంత్రి తెలిపారు. ఇందులో దేశీయ ఉత్పత్తి ద్వారా 0.87 లక్షల మెట్రిక్‌ టన్నుల ప్రణాళిక ఉండగా, దిగుమతుల ద్వారా 1.13 లక్షల మెట్రిక్‌ టన్నుల ప్రణాళిక ఉందన్నారు. అదేవిధంగా అక్టోబర్‌లో DAPకు సంబంధించి 0.30 లక్షల మెట్రిక్‌ టన్నుల సరఫరా ప్రణాళిక ఉందని, ఇందులో దేశీయంగా 0.06 లక్షల మెట్రిక్‌ టన్నులు, దిగుమతుల ద్వారా 0.24 లక్షల మెట్రిక్‌ టన్నుల ప్రణాళిక ఉందని తెలిపారు.
ఫార్మర్స్‌ రిజిస్ట్రీలో తెలంగాణ ముందంజ
రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని డిజిటల్‌గా అందుబాటులోకి తీసుకురావడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తూ ఫార్మర్స్‌ రిజిస్ట్రీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఇక వ్యవసాయ రంగంలో మరో కీలకమైన డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియను కూడా రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతు ఏ పంట సాగు చేస్తున్నాడు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు అనే ఖచ్చితమైన సమాచారం డిజిటల్‌ విధానంలో అందుబాటులో ఉంటే, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన రైతులకు మరింత సమర్థవంతంగా అందించవచ్చన్నారు.

డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో 75.9 శాతం పూర్తి…
వానాకాలం 2026-27కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో ఇప్పటివరకు 1,93,25,309 వ్యవసాయ క్షేత్రాలను సర్వేకు కేటాయించగా, 1,46,67,370 క్షేత్రాల సర్వే పూర్తయింది. మొత్తం 75.9 శాతం సర్వే పూర్తయినట్లు రాష్ట్రవ్యాప్తంగా 10,164 మంది వాలంటీర్లు రిజిస్టర్‌ కాగా, 9,820 మంది యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని సర్వే ప్రారంభించారు. అక్టోబర్‌ 5న ఒక్క రోజులోనే 2,69,597 వ్యవసాయ క్షేత్రాల సర్వే పూర్తయిందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో 95 శాతం పూర్తి కాగా.. రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో తక్కువగా ఉంది. ఇందులో కూడా తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉందని తెలిపారు. అంతేగాక, భవిష్యత్తులో డిజిటల్ క్రాప్ సర్వే ఆధారంగానే పంటల కొనుగోళ్లు, యాంత్రీకరణ, సబ్సిడీపై విత్తనాల పంపిణీ వంటి అన్ని పథకాలు వర్తింప చేస్తామని మంత్రి తెలిపారు.