ఇన్వెస్ట్ తెలంగాణ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

  • పెట్టుబడులను ఆకర్షించేందుకు సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి.

హైదరాబాద్ : రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించడం, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం, తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ తెలంగాణ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశం బుధవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడం, పారిశ్రామికవేత్తలకు వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతులు, అవసరమైన ప్రభుత్వ సహకారం అందించడం తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా పరిశీలించి, వివిధ శాఖల మధ్య సమన్వయంతో నిర్ణీత కాలవ్యవధిలో కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనలో అగ్రగామిగా నిలిపేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ కీలక వేదికగా పనిచేయాలని సీఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, TGIIC MD శశాంక, ITE&C సంయుక్త కార్యదర్శి అనుదీప్, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ, ఎండీ, అజిత్ రెడ్డి, నిఖిల్ చక్రవర్తి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.