సరకా లేబొరేటరీస్‌లో క్లోరోఫామ్ గ్యాస్ లీకేజీ ఘటనపై టీజీహెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరణ.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నుంచి నివేదికకు ఆదేశం

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ గౌరవ చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో, సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలోని సరకా లేబొరేటరీస్ లిమిటెడ్‌లో 22.10.2026 రాత్రి క్లోరోఫామ్ ఆవిరి లీకేజీ కారణంగా ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి సాక్షి (“పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరి మృతి”), ఈనాడు (“క్లోరోఫామ్ లీకై ఇద్దరు కార్మికుల మృతి”), ఆంధ్రజ్యోతి (“పరిశ్రమలో గ్యాస్ లీక్.. ఇద్దరి మృతి”), దిశ (“గ్యాస్ లీకై ఇద్దరు మృతి”), నమస్తే తెలంగాణ (“రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరి మృతి”), ది హిందూ (“Two killed in chloroform vapour leak at pharma unit”), డెక్కన్ క్రానికల్ (“Chloroform leak at Sarca labs claims 2 workers’ lives”), ది టైమ్స్ ఆఫ్ ఇండియా (“2 workers die in gas leak at pharma unit near Hyd”) సహా అన్ని ముద్రణ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో వచ్చిన వార్తలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది.

వార్తా కథనాల ప్రకారం, ఈ ఘటనలో మరికొందరు కార్మికులు కూడా అస్వస్థతకు గురై చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించబడ్డారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ అనంతరం పరిశ్రమను మూసివేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ ఘటన పారిశ్రామిక భద్రతకు సంబంధించి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా హామీ ఇవ్వబడిన జీవించే హక్కు పరిరక్షణ విషయంలో తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తోందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, ఘటనకు దారితీసిన పరిస్థితులు, మృతులు మరియు గాయపడిన కార్మికుల వివరాలు, బాధితులకు అందించిన వైద్య సహాయం, పరిశ్రమలో అమలులో ఉన్న భద్రతా చర్యలు, సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నుంచి 26.11.2026లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.