- నిర్మాణ ప్రాజెక్టుల్లో పర్యావరణ నిబంధనల అమలు, వాయు కాలుష్య నియంత్రణ చర్యల పరిశీలనకు రోలింగ్ టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటు, తనిఖీల నిర్వహణ
- ఈ రోజు టిజిపిసిబి ప్రధాన కార్యాలయంలో నానక్రామ్గూడ, కోకాపేట ప్రాంతాల్లోని 19 నిర్మాణ ప్రాజెక్టుల పర్యావరణ నిబంధనల అమలు స్థితిగతులను సమీక్షించిన టాస్క్ ఫోర్స్ కమిటీ
- తీవ్ర ఉల్లంఘనలకు పర్యావరణ పరిహారం, తక్కువ తీవ్రత కలిగిన ఉల్లంఘనలపై బ్యాంకు గ్యారంటీల జప్తుకు కమిటీ సిఫారసు, నిబంధనల ఉల్లంఘనల సవరణకు 10 రోజుల గడువు
హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన నానక్రామ్గూడ, కోకాపేట ప్రాంతాల్లో నిర్మాణ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతున్నదని పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది. నిర్మాణ ప్రాజెక్టుల్లో పర్యావరణ నిబంధనల అమలు, వాయు కాలుష్య నియంత్రణ చర్యల స్థితిగతులను పరిశీలించేందుకు టిజిపిసిబి రోలింగ్ టాస్క్ ఫోర్స్ (నిరంతర తనిఖీ) బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణను చేపట్టింది. ఈ క్రమంలో, ఈ రోజు (24 అక్టోబర్) నిర్వహించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశంలో నానక్రామ్గూడ, కోకాపేట ప్రాంతాల్లోని 19 నిర్మాణ ప్రాజెక్టుల పర్యావరణ నిబంధనల అమలు స్థితిగతులను టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షించింది. ఆయా ప్రాజెక్టుల తరఫున పలువురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రాజెక్టుల వారీగా నిబంధనల అమలుపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమగ్రంగా చర్చించిన తర్వాత, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాజెక్టులపై పర్యావరణ పరిహారం విధించాలని, తక్కువ తీవ్రత ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాజెక్టుల విషయంలో అవి సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను జప్తు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. అలాగే, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన కార్యకలాపాల నిర్వహణ అనుమతి ఉత్తర్వులు (Consent to Operate) పొందకుండా పనిచేస్తున్న రెండు నిర్మాణ ప్రాజెక్టులకు అనుబంధంగా పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) ప్లాంట్లపై మూసివేత ఉత్తర్వులు జారీ చేయాలని కమిటీ సిఫారసు చేసింది. నిబంధనలు పాటించని నిర్మాణ ప్రాజెక్టులు గుర్తించిన నిబంధనల ఉల్లంఘనలను సరిదిద్దుకునేందుకు 10 రోజుల్లోగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలనీ కమిటీ సిఫారసు చేసింది. కమిటీ సిఫారసుల మేరకు, సంబంధిత ప్రాజెక్టులపై పర్యావరణ పరిహారం విధించడం, బ్యాంకు గ్యారంటీలను జప్తు చేయడం, నిబంధనలను పాటించని ప్రాజెక్టులకు ఉల్లంఘనలను సరిదిద్దుకోవాలని ఆదేశాలు జారీ చేయడం, కార్యకలాపాల నిర్వహణ అనుమతి ఉత్తర్వులు (CTO) లేకుండా పనిచేస్తున్న రెండు అనుబంధ RMC ప్లాంట్లకు మూసివేత ఉత్తర్వులు జారీ చేయడం వంటి తదుపరి చర్యలను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చేపట్టనుంది.