- బొకేలు, శాలువాలు, స్వీట్స్‌తో వచ్చి శుభాకాంక్షలు తెలపవద్దు
- అభిమానులు, శ్రేయోభిలాషులు ఎక్కడా ఆర్భాటాలకు తావివ్వవద్దు
- ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నిరాడంబరంగా పుట్టినరోజు
హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తన అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ బొకేలు, శాలువాలు, స్వీట్స్‌తో వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఆర్భాటాలు, వేడుకలు నిర్వహించవద్దని, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించాలని, తన పుట్టినరోజును నిరాడంబరంగా గడపాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. తనపై అభిమానంతో శుభాకాంక్షలు తెలియజేయాలనుకునే వారంతా ఈ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.