డిప్యూటీ తహసీల్దార్‌ నారాయణపై సస్పెన్షన్‌ వేటు

మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాలకు ఎన్‌ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్‌ ఘటనలో అదనపు కలెక్టర్‌ నగేశ్, నర్సాపూర్‌ ఆర్డీఓ అరుణారెడ్డితోపాటు మరో ముగ్గురు కటకటాలపాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ బాగోతాన్ని మరువక ముందే మెదక్‌ కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్న నారాయణపై సస్పెన్షన్‌ వేటు పడింది. గతంలో పనిచేసిన జిన్నారం మండలంలో మృతిచెందిన తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ పట్టాపాస్‌ బుక్కులు సృష్టించడంలో ఆయన పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం రాత్రి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.