మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఉప్పల్ సీఐగా నర్సింహారెడ్డి పని చేశారు. అయితే ఆయన అనేక భూతగాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏసీపీ నర్సింహారెడ్డి రూ. 50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మాజీ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు నర్సింహారెడ్డి.
హైదరాబాద్లోని సికింద్రాబాద్, మహేంద్రహిల్స్, డీడీ కాలనీ, అంబర్పేట, ఉప్పల్, వరంగల్లో 3 చోట్ల, కరీంనగర్లో 2 చోట్, నల్లగొండలో 2 చోట్ల, అనంతపూర్లో సోదాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ నివాసంలో భారీగా బంగారు, వెండి ఆభరణాలను అధికారులు గుర్తించారు. 2008 నుంచి 2010 వరకు మియాపూర్లో సీఐగా పని చేసిన నరసింహారెడ్డి పలు భూవివాదాల్లో తలదూర్చి ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు. ఉప్పల్, మల్కాజ్గిరిల్లోనూ భూవివాదాల్లో ఏసీపీ తలదూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం వరకు ఏసీబీ సోదాలు జరిగే అవకాశం ఉంది.