అక్ర‌మాస్తుల‌ కేసులో మల్కాజిగిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి అరెస్ట్.. కొన‌సాగుతోన్న సోదాలు

అక్ర‌మాస్తుల‌ కేసులో మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారులు గురువారం ఉద‌యం అరెస్టు చేశారు. ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, అనంత‌రం ఏసీబీ కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. నిన్న రాత్రి వ‌ర‌కు రూ. 70 కోట్ల అక్ర‌మాస్తుల‌ను అధికారులు గుర్తించారు. సోదాలు ఇవాళ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు జ‌రిగే అవ‌కాశం ఉంది. న‌ర్సింహారెడ్డికి ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకులో లాక‌ర్లు ఉన్న‌ట్లు గుర్తించారు. హైద‌రాబాద్‌లోని బ్యాంకు లాక‌ర్ల‌ను ఏసీబీ అధికారులు తెర‌వ‌నున్నారు. అనంత‌పురం జిల్లా తాడిమ‌ర్రి మండ‌లం పూలఓబ‌య్య‌ప‌ల్లెలో నర్సింహారెడ్డి ఆస్తుల‌పై విచార‌ణ కొన‌సాగుతోంది. వ్య‌వ‌సాయ భూములు, ఇత‌ర ఆస్తి సంబంధిత ప‌త్రాల‌ను అధికారులు తీసుకెళ్లారు. 

ఇదీ ఆస్తుల చిట్టా 

ఏకకాలంలో 25 చోట్ల నిర్వహించిన సోదాల్లో ఏసీబీ అధికారులు పలు విలువైన ఆస్తులను గుర్తించారు. పట్టుబడిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.7.5 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

  • ఏపీ అనంతపురంలో 55 ఎకరాల పొలం
  • హైదరాబాద్‌లో సైబర్‌ టవర్ల ఎదుట 1,960 చదరపు గజాలు కలిగిన నాలుగు ఇంటి స్థలాలు
  • హఫీజ్‌పేటలో రెండు ఇండ్ల స్థలాలు, జీప్లస్‌ 3 వాణిజ్య భవనం
  • రెండు సొంత ఇండ్లు, రూ.15 లక్షల బ్యాంకు నిల్వ, రెండు బ్యాంకు లాకర్లు
  • రియల్‌ఎస్టేట్‌తోపాటు ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు