- పరిశ్రమల ఇన్స్ పెక్షన్ తో బోర్డుకు రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గంలో తమ జేబులో వేసుకుంటున్న పర్యావరణ ఇంజినీర్లు
- పరిశ్రమలపై ఫిర్యాదులు వస్తే పండుగ చేసుకుంటున్న ఆర్.ఒ. అధికారులు
- పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మక్కై విచ్చలవిడి అవినీతి చేస్తున్న ఇ.ఇ.లు
- పరిశ్రమలు చేసే కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యత తమదే అన్న సంగతే మరిచిన పర్యావరణ ఇంజినీర్లు
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు వచ్చే ఆదాయానికి ఆర్.ఒ. అధికారులు గండికొడుతున్నారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలో ఉన్న పరిశ్రమల నుండి పిసిబికి వివిధ రకాల ఆదాయ వనరులు ఉన్నాయి. అవి సి.ఎఫ్.ఇ. మరియు సి.ఎఫ్.ఒ. ఫీజులు వసూలు చేయడం ద్వారా, పరిశ్రమలలో శ్యాంపిల్స్ తీసి ల్యాబ్స్ కు టెస్టింగ్ కోసం పంపండం ద్వారా వచ్చే ఫీజులు, అలాగే పరిశ్రమలలో ఎయిర్ మానిటరింగ్ మరియు స్టాక్ మానిటరింగ్ చేయడం ద్వారా వచ్చే ఫీజులు, ఇంకా కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించకుండా తప్పుచేసిన పరిశ్రమలకు బ్యాంక్ గ్యారంటీ రూపంలో జరిమానాలు విధించడం ద్వారా వచ్చే ఆదాయాలు ఇలా అనేక రకాలుగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదాయం సమకూరుతుంది. ఈ రూపంలో వచ్చే ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు, కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవడం మరియు పర్యావరణ పరిరక్షణకు వివిధ రకలైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కానీ రాను.. రాను.. పిసిబి ఆర్.ఒ. అధికారుల తీరుతో.. వారి అడ్డగోలు అవినీతితో బోర్డుకు రావాల్సిన ఆదాయానికి గండిపడుతుందనేది ఎవరు నమ్మిన, నమ్మకపోయిన, ఇది పచ్చి నిజం.
కాలుష్యాన్ని అరికట్టే విషయంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నాతాధికారులు ఎలాగు చొరవ చూపడం లేదు. కనీసం బోర్డుకు రావాల్సిన ఆదాయం అయినా పక్కగా వచ్చేలా చూస్తే బాగుంటుందనేది మేధావులు, పర్యావరణ వేత్తల అభిప్రాయం. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇంతకు ముందులా ఆదాయం రావడం లేదనేది కొంత మంది మేధావుల మాటల ద్వారా తెలుస్తుంది. దానికి కారణం కేవలం ఆర్.ఒ.లలో పనిచేసే పర్యావరణ ఇంజినీర్ల పనితీరు సరిగా లేకపోవడమే అని సామాన్యులకు సైతం అర్థమవుతుంది.
పిసిబి ఆర్.ఒ. అధికారుల పనితీరు ఏమాత్రం బాగోలేదు అనడానికి 17 కేటగిరి పరిశ్రమలను ప్రతి 3 నెలలకు ఒకసారి, రెడ్ కేటగిరి పరిశ్రమలను ప్రతి 6 నెలలకు ఒకసారి, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ప్రతి సంవత్సరానికి ఒకసారి మానిటరింగ్ చేయాలి. పోనీ కనీసం 6 నెలలకు ఒకసారి అయిన మానిటరింగ్ చేసి బోర్డుకు రావాల్సిన ఆదాయం వచ్చేలా చేస్తారా అంటే అదీ లేదు. కానీ ఆర్.ఒ. అధికారులు మాత్రం పరిశ్రమలకు ఇన్స్ పెక్షన్ కోసం వెళ్తారు వాటర్ శ్యాంపిల్స్ తీస్తారు. దానితో ఆ పరిశ్రమ వారు భయపడిపోయి బేరానికి వస్తారు.. బేరం కుదరగానే తీసిన శాంపిల్స్ ను పరిశ్రమ బయటకు రాగానే పారబోస్తారు. దీని వెనుక ఉన్న మర్మం ఎంటా అని చూస్తే శాంపిల్స్ తీసి ల్యాబ్ కు పంపిస్తే ఎనాలసిస్ ఛార్జీలు అవి ఇవి అని అక్కడ చాలా ఖర్చు అవుతది వాటిని పరిశ్రమ వారే చెల్లించాల్సి ఉంటది, అంతేకాకుండా ఆ ల్యాబ్ కు వెళ్లగానే అక్కడ అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అవి ఏంటంటే ఆ వాటర్ శాంపిల్స్ లోనే పారామీటర్స్ యొక్క వ్యాల్యూస్ మోతాదుకు మించి ఎక్కువగా వస్తే ఆ పరిశ్రమకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఆయా పరిశ్రమల వారు భయపడి, ఈ గొడవంతా ఎందుకు అని పర్యావరణ ఇంజినీర్లకే పెద్ద మొత్తంలో చెల్లింపులు చేస్తున్నారని, ఈ విధంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టి బోర్డు రెవెన్యూని అక్రమ మార్గంలో పర్యావరణ ఇంజినీర్లు తమ జేబుల్లో వేసుకుంటున్నారని ప్రజల నుండి వినిపిస్తున్న మాట.
అంతటితో ఆగకుండా కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై కాలుష్య బాధితులు లేదా పర్యావరణ వేత్తలు ఫిర్యాదు చేస్తే మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకపోవడమే కాకుండా మా దగ్గర స్టాఫ్ లేదు అని సాకులు చెప్తారు. వచ్చిన ఫిర్యాదుపై ఇన్స్ స్పెక్షన్ చేయడానికి 2 లేదా 3 నెలల సమయం తీసుకుంటున్నారు. ప్రతి ఆర్.ఒ.లో ఇంజినీర్లు, సైంటిస్టులు ఉన్నారు. శాంపిల్స్ కానీ, మానిటరింగ్ కానీ, ఎవరు చేయాలి..? సైంటిఫిక్ స్టాఫ్ చేయాల్సిన పనిని కూడా ఇంజినీర్లే ఎందుకు చేస్తున్నారు…? అలాంటప్పుడు బోర్డులో సైంటిస్టులు ఎందుకు..? బోర్డు మాత్రం ఆర్.ఒ.లకు కాలుష్య నియంత్రణ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం అన్ని సౌకర్యాలను సమకూర్చింది. కానీ వీళ్లు మాత్రం వాటిని తమ స్వార్థానికి, స్వలాభానికి వాడుకుంటూ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదాయానికే ఎసరు పెడుతున్నారని వినికిడి.
బోర్డు ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన లెక్కలను మరియు బోర్డు పనితీరు ఎలా ఉంది అని సరిచూడటానికి ఫైనాన్షియల్ ఆడిటింగ్ మరియు పెర్ ఫార్మెన్స్ ఆడిటింగ్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. దీనిలో కూడా బోర్డు నియమించిన ఇంటర్నల్ ఆడిట్ అలాగే బయట నుండి చేసే ఎక్స్ టర్నల్ ఆడిట్ అనే రెండు రకాల ఆడిటింగ్ లు జరుగుతాయి. ఈ ఆడిటింగ్ లు అయినా సక్రమంగా, పారదర్శకంగా జరుగుతాయా అంటే మనం అతిగా ఊహించుకుంటున్నట్లే… ఇంటర్నల్ ఆడిట్ అయితే మరీ ఘోరం బోర్డు నియమించిన ఆడిటింగ్ అధికారులే కాబట్టి ఆటోమెటిక్ గా అన్ని రిపోర్టులు బోర్డుకు అనుకూలంగానే వస్తాయి. ఇక ఎక్స్ టర్నల్ ఆడిట్ గురించి చెప్పుకోవలంటే ఆడిటింగ్ అధికారులు రావడమే ఆలస్యం వీరికి ఏసీ రూంలతో సహా సకల సౌకర్యాలు కల్పించి వారిని మచ్చిక చేసుకుని వీరికి అనుకూలంగా రిపోర్ట్ లు ఇప్పించుకుంటారు. రిపోర్ట్ లు పూర్తిగా అనుకూలంగా ఉంటే అందరికీ అనుమానం వస్తదని ఏదో ఒకటి లేదా రెండు నామమాత్రపు కొర్రీలతో రిపోర్ట్ లు సమర్పించడం జరుగుతుంది. కావున ఇంత సమర్థవంతమైన మరియు పారదర్శకమైన ఆడిటింగ్ జరగడం వలన బోర్డులో జరుగుతున్న అవినీతి కానీ, నాణ్యమైన పనితీరు కనపర్చకపోవడం అనే విషయాలు మచ్చుకైన కనిపించవు.
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆర్.ఒ. అధికారుల పనితీరు ఇలాగే ఉంటే త్వరలోనే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఆర్.టి.సి. పరిస్థితిలా దివాళ తీసే దిశగా పోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా బోర్డు ఉన్నతాధికారులు ఆర్.ఒ. అధికారుల అవినీతిని కట్టడి చేయకపోతే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిస్థితి అదోగతే…..