చలిమంట వేస్తే జరిమానా : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యానికి కారణాలవుతున్న చలిమంటలపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపిస్తున్నది. ఇందులో భాగంగా వ్యర్థాలు, టైర్లు తదితరవాటిని కాల్చేవారిపై జరిమానాలు విధించాలని నిర్ణయించింది. అంతేకాదు, తమ సిబ్బంది ఎక్కడైనా చెత్తను కాల్చినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ క్షేత్రస్థాయి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. 

నగరంలో పలుచోట్ల బల్దియా కార్మికులు సైతం చెత్తను ఊడ్చిన తర్వాత తగలబెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాలనీవాసులు ఇలా చేస్తున్నారు. చలికాలంలో నైతే ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటున్నది. ముఖ్యంగా ఆకురాలే కాలం అయినందున చెట్లు ఉన్నచోట రాలిన ఆకులను కుప్పగాపోసి కాల్చడం, పంచర్లు వేసే దుకాణాల వద్ద పాత టైర్లను కాల్చుతూ చలికాగడం సాధారణంగా మారింది. మరోవైపు, రోడ్లు పాడైనచోట ధూళికణాలు గాలిలో కలువడం, ట్రాఫిక్‌ అధికంగా ఉన్నప్పుడు వాహనాలు ఎక్కువసేపు ఆగి కాలుష్యం ఏర్పరచడం వంటివి జరుగుతున్నాయి. మంచు పడడం, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం, అన్నీ వెరసి చలికాలంలో కాలుష్యం పెరిగిపోయి గాలి నాణ్యత తగ్గిపోతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఇదివరకే క్లీన్‌ ఎయిర్‌ అథారిటీని ఏర్పాటు చేశారు. కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్‌ కార్పొరేషన్‌, ట్రాఫిక్‌, ఇంజినీరింగ్‌ తదితర విభాగాల అధికారులతో కూడిన ఈ విభాగంలో జీహెచ్‌ఎంసీ పాత్ర అత్యంత కీలకమైందిగా చెప్పవచ్చు. 

చెత్తను కాల్చకుండా చర్యలు

 గాలి నాణ్యతను పెంచే చర్యల్లో మంటలను అదుపుచేయడం అత్యంత ప్రధానమైనది. ఇందులో భాగంగా ఎక్కడా వ్యర్థాలు కాల్చకుండా చూడాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ, ఈ బాధ్యతను ఆయా సర్కిళ్లలోని సహాయ వైద్యాధికారులకు అప్పగించింది. తమ పారిశుధ్య సిబ్బంది ఎక్కడైనా వ్యర్థాలను కాల్చితే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు కాల్చితే జరిమానాలు విధించాలని కమిషనర్‌ ఆదేశించారు. చెత్తను కాల్చకుండా రోజూ ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని, ఎక్కడ ఎక్కువగా వ్యర్థాలను కాల్చుతున్నారో గుర్తించాలని ఆయన కోరారు. చెత్తను కాల్చడంపై పూర్తి నిషేధం ఉన్నందున ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన స్పష్టంచేశారు. చెత్తను, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలిగించే విధంగా చెత్త వాహనాల సంఖ్యను కూడా పెంచారు.

సేంద్రియ వ్యర్థాల కోసం కంపోస్ట్‌ పిట్లు

పార్కుల్లో వెలువడే ఆకులు, చెత్త తదితర సేంద్రియ వ్యర్థాలను తగలబెట్టకుండా ఎరువుగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ 406పార్కుల్లో  కంపోస్టు పిట్లను ఏర్పాటు చేసింది. దీంతో ఏ పార్కులో చెత్తను ఆ పార్కులోనే ఎరువుగా మార్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు వేసి తగులబెట్టే వీలుండడంతో రెండేండ్ల కన్నా ఎక్కువ రోజులు ఖాళీగా ఉండే స్థలాల్లో మొక్కలు నాటి వాటిని పెంచాలని నిర్ణయించారు. వ్యర్థాలను తడి, పొడిగా విడదీసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, వ్యర్థాలను పూర్తిగా రీసైకిల్‌ చేయడం ద్వారా పునర్వినియోగంలోకి తెస్తూ జీరో ల్యాండ్‌ఫిల్‌ విధానాన్ని అమలుచేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నారు.