ఫార్మారంగానికి ఉజ్వల భవిష్యత్‌ : నీతి అయోగ్‌ సభ్యుడు విజయ్‌కుమార్‌ సరస్వత్

ఫార్మారంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందని పద్మ భూషణ్‌, నీతి అయోగ్‌ సభ్యుడు విజయ్‌కుమార్‌ సరస్వత్‌ అన్నారు. బాలానగర్‌ పారిశ్రామికవాడ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైపర్‌)లో మంగళవారం నిర్వహించిన 14వ ఫౌండేషన్‌ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఫార్మాస్యూటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కరోనా విజృంభణ సమయంలో బయోఫార్మా ముందుకు వచ్చి వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు సంకల్పించినట్లు ప్రకటించిందన్నారు. డేటా నుంచి జ్ఞానం పొంది సాంకేతిక పరిజ్ఞాణంతో డిజిటల్‌ రంగంలో పురోగతి సాధించడం శుభ పరిణామం అన్నారు. భారీ రసాయన పరిశ్రమలను కాలుష్యరహిత సాంకేతికతలతో పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో ఫైటో ఫార్మాస్యూటికల్‌ పరిశోధన తెరపైకి రానుందని తెలిపారు. అనంతరం బిరాక్‌ చైర్‌పర్సన్‌, డీబీటీ కార్యదర్శి డాక్టర్‌ రేణు స్వరూప్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ నైపర్‌ హైదరాబాద్‌ అనతి కాలంలోనే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌-2020లో భాగంగా ఫార్మసీ విభాగంలో ఐదో స్థానం దక్కించుకోవడం హర్షణీయమన్నారు. అధునాతన అధ్యయనాల, ఔషధ శాస్ర్తాలను నేర్చుకోవడానికి అత్యుత్తమ కేంద్రం గా నిలవడం సంతోషకరమన్నారు.  నైపర్‌ డైరెక్టర్‌ శశిబాలాసింగ్‌, డీన్‌ నందూరి శ్రీనివాస్‌, ఫ్యాకల్టీలు, విద్యార్థులు పాల్గొన్నారు.