అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవడమే కాకుండా వాటి పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అవసరమని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ లోకేశ్ జైశ్వాల్ అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ శర్మన్‌తో కలిసి జిల్లాలోని అడవుల సంరక్షణ, పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అటవీశాఖ అధికారులకు బుధవారం ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. అడవితోపాటు పులులు, ఇతర జంతుజాలాన్ని రక్షించేందుకు టైగర్ రిజర్వ్‌లను రక్షించుకోవాలని చెప్పా రు. అటవీ ప్రాంతానికి రక్షణగా కంచె ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం జిల్లాలో దాదాపు 2.5 లక్షల హెక్టార్లలో ఉన్న అటవీ ప్రాంతానికి సుమారు 681 కిలోమీటర్ల కంచె అవసరమవుతుందన్నారు. ఇప్పటి వరకు 416 కిలోమీటర్ల మేర కందకాలు ఏర్పాటు చేయడం, గచ్చికాయల మొక్కలు పెంచడం, ఇతర పద్ధతుల ద్వారా కంచె ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
మిగిలిన భాగం పూర్తి చేయడానికి అటవీశాఖ అధికారులు కృషి చేయాలన్నారు. జంతువుల సంరక్షణకు సాసర్‌ఫిట్‌లు ఏర్పాటు చేయాలని, కలప దొంగతనాలు అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పథకం ద్వారా చెక్ డ్యామ్‌లు, పర్కులేషన్ ట్యాంకుల ఏర్పాటు పనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ అడవులు అంటే తనకు ప్రత్యేక అభిమానమని అన్నారు. జిల్లాలో అటవీ ప్రాంత అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. అంతకుముందు లోకేష్ జైశ్వాల్‌ను కలెక్టర్ పూలమొక్క అందజేసి స్వాగతించారు. సమావేశంలో అటవీశాఖ అద నపు కన్జర్వేటర్ సిన్హా, అదనపు కలెక్టర్లు మను చౌదరి, హన్మంత్‌రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ చిత్ర మిశ్రా, జిల్లా అటవీశాఖాధికారి కిష్టగౌడ్, డీఆ ర్‌డీవో సుధాకర్, అటవీశాఖ రేంజ్ అధికారులు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.