బేగంపేట డివిజన్‌లో పారుతున్న కూకట్‌పల్లి నాలాలో విష రసాయనాలు కలుస్తుండంటంతో దాని నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. నాలా నుంచి వెలువడుతున్న దుర్గంధం రోజురోజుకు అధిక మౌతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏండ్ల తరబడి సమస్య ఉన్నప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదని బస్తీవాసులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు కురిసిన సమయంలో దుర్గంధం అంతగా లేనప్పటికీ అనంతరం వచ్చే వాసన భరించలేక పోతున్నామని ఆందోళనకు గురవుతున్నారు. ఘాటైన రసాయనాల కంపు భరించలేక పోతున్నామని చెబుతున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి..
ఎగువ ప్రాంతాల నుంచి ఈ నాలా ప్రవాహం బేగంపేట మీదుగా సాగుతూ.. హుస్సేన్ సాగర్‌లో కలుస్తుంది. అయితే బేగంపేటకు రాగానే ఇక్కడ మరీ ఘాటైన దుర్వాసన స్థానికులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నెలలో నలుగురైదుగురు ఈ దుర్వాసన పీల్చి రోగాల బారిన పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో నాలా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అనేక విషరోగాల బారిన పడుతున్నారు. ఇలా నాలలో వచ్చే వ్యర్థాలు, మురుగుతో కలిసి బేగంపేట కట్టమైసమ్మ ఆలయం పక్కనే ప్రవహిస్తూ హుస్సేన్ సాగర్ నీటిలో కలుస్తాయి. ఇది అసలే చలికాలం, దీంతో పాటు కరోనా వైరస్ ప్రభావం కూడా ఇప్పుడు తోడైంది. దీంతో శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉందని బస్తీ వాసులు భంయాందోళను గురవుతున్నారు.
పరివాహక ప్రాంతాల్లో ఇబ్బందులు..
బేగంపేట నాల పరివాహక ప్రాంతాల్లో ప్రధానమైనవి ఓల్డ్ కస్టమ్స్‌బస్తీ, శ్రీదేవి కట్టమైసమ్మ ఆలయం, వరుణ్‌మోటార్స్, బ్రహ్మణవాడి, వడ్డెరబస్తీ, మాతాజీనగర్, రామనంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంతాలు. ప్రధానంగా కట్టమైసమ్మ ఆలయానికి వచ్చే భక్తులు నిత్యం ముక్కు మూసుకునే రావాలి. అలాగే పేద విద్యార్థులు చదువుకునే రామానంద తీర్థలో ఇబ్బందులు పడుతున్నారు. ఓల్డ్ కస్టమ్స్ బస్తీలోని ప్రజలు నిత్యం దుర్గంధ భరితమైన వాతావరణంలో కాలం వెల్లదీస్తున్నారు. వీరితో పాటు ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి రసాయన వ్యర్థాలు నాలాలో కలువకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
క్రమం తప్పకుండా పూడిక తీసివేస్తున్నాం
బేగంపేట నుంచి ప్రవహిస్తున్న నాలాలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా చెత్తను తీసివేయిస్తు న్నాం. దీంతో పాటు యేడాదిలో రెండు సార్లు పూడికతీత కూడా చేపడుతున్నాం. ఇంత వరకే మేము చూసేది. మురికి నీరు ప్రవహించే దాంట్లోనే రసాయనాల పైపులైన్లు వెలుతున్నాయి. అవి అక్కడక్కడ లీక్ అవడం వల్ల ఈ దుర్గంధానికి కారణమై ఉండొచ్చు. లీక్ కాకుండా చూడాలి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం.
– శివానంద్ (ఈఈ బేగంపేట్ సర్కిల్)
చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు
నాలాలో ప్రమాదకర రసాయనాలు కలుస్తున్నాయట. పై నుంచి బేగంపేటకు వచ్చే సరికి నాలా నుంచి ఘాటైన వాసన వస్తుంది. రాత్రిపూట ఈ వాసన అధికంగా ఉంటుంది. ఈ దుర్గంధాన్ని పీలుస్తూ ఇంట్లో చిన్నారులు, వృద్ధులు త్వరగా రోగాల బారిన పడుతున్నారు. నాలా పక్కన నివసిస్తున్న వారమంతా పేదోళ్లమే. మేము మా బాధను ఎవరికి చెప్పాలో తెలియడం లేదు.
– విజయలక్ష్మి, బేగంపేట ఎక్స్‌టెన్షన్ బస్తీ
అధికారులు చొరవ తీసుకోవాలి
నాలా పరివాహక ప్రాంతాల్లో నివస్తున్న పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉన్నతాధికారులు కాస్త చొరవ చూపాలి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి వచ్చే ప్రమాదకర రసాయనాలను నాలాల్లోకి రాకుండా చూస్తు వాటికి ప్రత్యామ్నాయాలు కనుక్కోవాలి. దీంతో స్థానికులు కొంత వరకు ఊపిరి పీల్చుకుంటారు.
– వెంకట్ (మాతాజీ నగర్) సోర్స్ : (ఎన్ టి)