పిసిబి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన దవాఖానపై చీటింగ్‌ కేసు

కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి తప్పడు అనుమతులు పొందిన ‘ఫెమీ కేర్‌’  నర్సింగ్‌హోమ్‌ దవాఖానపై జూబ్లీహిల్స్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ సమీపంలోని తాహెర్‌ విల్లా కాలనీలో ‘ఫెమీ కేర్‌’  నర్సింగ్‌హోమ్‌ కొనసాగుతోంది. దవాఖానలో 23 పడకలు ఉన్నాయని, తమ వద్ద వెలువడే బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణను నిర్దేశిత ప్రమాణాలకు లోబడి చేపడతామని దరఖాస్తు చేసుకొని 2017లో పీసీబీ అనుమతి పొందింది. ఈ అనుమతులు 2024 దాకా కొనసాగుతాయని పీసీబీ తెలిపింది. ఇదిలా ఉండగా రెండేళ్లుగా దవాఖాన సామర్థ్యాన్ని 43 పడకలకు, అనంతరం 105 పడకలకు పెంచుకున్న నిర్వాహకులు పీసీబీ నుంచి అనుమతులు పొందలేదు. 

‘ఫెమీ కేర్‌’ నర్సింగ్‌హోమ్‌ దవాఖానలో సామర్థ్యానికి మించిన బెడ్స్‌ ఉన్నాయని, వ్యర్థాల నిర్వహణ సరిగా లేదంటూ ఇటీవల కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పీసీబీ అధికారులు తాము కేవలం 23 పడకల దవాఖానకు మాత్రమే అనుమతులు ఇచ్చామని, బోగస్‌ పత్రాలు సృష్టించి 103 పడకల దవాఖాన నడిపిస్తున్నట్లు గుర్తించారు. సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్‌ పత్రాలను సృష్టించిన ’ఫెమీ కేర్‌‘ దవాఖానపై చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ ఎం.దయానంద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 406,420,468, 471 సెక్షన్ల కింద దవాఖానపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.