ఏపీలో నేడు రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. అలాగే నివర్‌ తుఫాను పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ సైతం చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా మూడో విడత కింద 51.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,120 కోట్లు జమ చేయనున్నారు. అలాగే రూ. 601.66 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే పీఎం కిసాన్‌ మూడో విడత రూ.2వేలు, ఇప్పటికే కొంత మంది ఖాతాల్లో జమయ్యాయి. అటవీహక్కుల రైతులు, అసైన్డ్‌ భూములు సాగు చేస్తున్న రైతులకు పీఎం కిసాన్‌ నిధులు జమకానున్నాయి. నివర్‌ తుఫానుతో నష్టపోయిన 8.34లక్షల మంది రైతులకు రూ.646 కోట్ల పెట్టుబడి రాయితీ అందనుంది. అలాగే ఉద్యాన పంటల రైతులకు రూ. 44.33 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపునకు అనుమతులు జారీ చేసింది. తుఫాను వల్ల 26,731 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించింది. బాధిత రైతుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయనున్నారు. రైతులకు ఏదైనా సమస్య వస్తే 155251 నంబర్‌కు తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది.