మహబూబాబాద్‌లో ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురు దుర్మరణం

పెళ్లి బట్టలు కొనేందుకు వెళ్తూ పెళ్లి పీటలెక్కాల్సిన యువతితో పాటు కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరింది. గూడూరు మండలం ఎర్రకుంట తండాకు చెందిన ప్రమీలకు వివాహం నిశ్చయం కాగా.. పెళ్లి బట్టలు కొనేందుకు కుటుంబీకులు నర్సంపేటకు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద నర్సంపేట నుంచి గూడూరు వైపుగా వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రమీల, ఆమె తల్లి కళ్యాణి, అన్న ప్రదీప్, బాబాయ్ ప్రసాద్, ఆయన కూతురు దివ్య, చిన్నాన్న కొడుకు, ఆటో డ్రైవర్‌ అయిన రాము అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధమవుతున్న యువతి, కుటుంబీకులు బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు

మర్రిమిట్ట ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.