తెలుగు కవి నిఖిలేశ్వర్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘అగ్నిశ్వాస (2017)’ కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన ఆయన ఆరుగురు దిగంబర కవుల్లో ఒకరు. నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదవరెడ్డి. దిగంబర కవులుగా మారిన తర్వాత ఆయన కలం పేరును నిఖిలేశ్వర్‌గా పెట్టుకున్నారు. ఆ పేరుతోనే సమాజంలో ప్రాచుర్యం పొందారు. కవి, కథకుడు, అనువాదకుడు, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరున్నది. హిందీ, ఇంగ్లిష్, తెలుగులో పదుల సంఖ్యలో కవితలు, రచనలు, అనువాదాలు చేశారు. 1965-1970 వరకు మూడు సంపుటాల దిగంబర కవిత్వం ప్రచురించారు. 1973లో ఏర్పాటైన విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక కార్యదర్శిగా పని చేశారు. జన సాహిత్య సాంస్కృతిక సమాఖ్యకి వ్యవస్థాపక కార్యకర్త (1979-1982)గా ఉన్నారు. విప్లవ కవిత్వాలు రాసినందుకు ఆయనపై 1971లో ప్రభుత్వం పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేసింది. 1969లో పోయెట్ అనే ప్రత్యేక సంచికకు గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించి దిగంబర కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. 1980-82 వరకు తెలుగు సాహిత్య మాస పత్రిక ప్రజా సాహితికి సంపాదకుడిగా వ్యవహరించారు. 1992-97 వరకు కేంద్ర సాహిత్య అకాడమిలో తెలుగు అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్నారు.