సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కేంద్రం బ్యాన్‌

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధాన్ని విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు విడతల్లో నిషేధాన్ని ప్రతిపాదించింది. దీంతో చిరు వ్యాపారులపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అలాగే వ్యర్థాల నుంచి పెరుగుతున్న ముప్పు దృష్ట్యా ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి 30వ తేదీ నుంచి పాలిథిన్‌ బ్యాగుల మందాన్ని 50 మైక్రాన్ల నుంచి 120 మైక్రాన్లకు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న పాలిథిన్ సంచులపై నిషేధం ఉంది. 2022 ఆగస్ట్‌ 15 నాటికి భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తికానున్నాయి. ఈ లోగా అన్ని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, సరఫరా, అమ్మకం, వినియోగంపై నిషేధం విధించనుంది.

రెండు దశల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం ఉండనుంది. మొదట జనవరి 1, 2022 నుంచి ప్లాస్టిక్‌ జెండాలు, బెలూన్లు, క్యాండి స్టిక్‌లపై నిషేధం అమలులోకి వస్తుంది. తర్వాత జూలై 1 నుంచి ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, చెంచాలు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, ర్యాపింగ్‌, ప్యాకింగ్‌ ఫిల్మ్‌, సిగరెట్‌ ప్యాకెట్‌ కవర్లు తదితర వాటిపై బ్యాన్‌ విధించనున్నారు. అందుబాటులో ఉన్న వస్తువులను దశలవారీగా నిషేధించాలని ఓ అధికారి తెలిపారు. అదే సమయంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను సమన్వయం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు.