ఎల్‌ఐసీ సరికొత్త పొదుపు పథకం

ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ.. సరికొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది. బచత్‌ ప్లస్‌ పేరుతో ఈ సేవింగ్స్‌ ప్లాన్‌ను పరిచయం చేసినట్లు సోమవారం సంస్థ తెలియజేసింది. పాలసీదారులకు రక్షణతోపాటు పొదుపునూ ఈ పథకం అందించగలదని ఎల్‌ఐసీ వెల్లడించింది. ఐదేండ్ల మెచ్యూరిటీతో వచ్చిన ఈ ప్లాన్‌.. పాలసీ కాలపరిమితిలో పాలసీదారు చనిపోతే బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. అలాగే మెచ్యూరిటీ సమయంలో పాలసీదారుకు పెద్ద మొత్తంలో నగదును అందిస్తుంది. పాలసీ పూర్తయ్యాక, మెచ్యూరిటీ తేదీ వచ్చేలోపే పాలసీదారు మరణించినట్లయితే అదనపు లాయల్టీతోపాటు బాధితులకు పరిహారం లభిస్తుందని ఎల్‌ఐసీ పేర్కొన్నది. కాగా, కనీస పాలసీ లక్ష రూపాయలుగా ఉన్నది. గరిష్ఠంగా ఎంతైనా తీసుకోవచ్చు. పెద్ద పాలసీల ప్రీమియం చెల్లింపు విధానాలపై రిబేటు కూడా లభిస్తుంది. ఇక ఈ ప్లాన్‌లో పాలసీదారులకు రుణాలు తీసుకునే వెసులుబాటు కూడా ఉన్నది.