నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 34 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలి ప్రాధాన్యం ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్‌ చేశారు. ఎన్నికల్లో 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 500 లోపు ఓట్లు వచ్చిన 34 మంది అభ్యర్థులను అధికారులు ఎలిమినేషన్‌ చేశారు. వారికి వచ్చిన ఓట్లను తొలి ఐదు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు కలిపారు. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 133 ఓట్లు, స్వతంత్య అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 119, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 137, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌కు 50, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 33 ఓట్లు కలిపారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇప్పటి వరకు వచ్చిన ఓట్లు 1,10,973 సంఖ్యకు చేరింది. అలాగే తీన్మార్‌ మల్లన్న 83,409, కోదండరామ్‌కు 70,209 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి విజయానికి 1,83,167 ఓట్లు అవసరం. నల్గొండలో పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో 3,87,969 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 3,66,333 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఏడు రౌండ్లలో 21,636 ఓట్లు చెల్లకుండాపోయాయి.