రసాయన పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నీటిశుద్ధికి వినియోగించే క్లోరిన్‌ డైయాక్సీ మాత్రలు తయారు చేసే రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికీలలకు 17 మంది సజీవ దహనమయ్యారు. ముల్షీ తాలూకాలోని పిరంగుట్ సమీపంలోని ఉరవాడే వద్ద ఉన్న ఎస్‌వీఎస్‌ ఆక్వా టెక్నాలజీస్‌ పరిశ్రమలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పరిశ్రమలో మరో 15 నుంచి 16 మంది చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. వీరిని రక్షించేందుకు ఇప్పటికే 5 అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయని పుణే రూరల్‌ ఎస్పీ అభినవ్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. ఇప్పటికే 17 మృతదేహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

విషయం తెలిసిన వెంటనే పుణే మెట్రోపాలిటన్‌ అభివృద్ధి సంస్థ, మహారాష్ట్ర ఇండస్ట్రీయల్‌ కార్పొరేషన్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల తీవ్రత, పొగ భారీగా అలుముకోవడంతో భవనంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పోలీసులు తెలిపారు. పుణే రూరల్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేస్తున్నారు. పరిశ్రమలో శానిటైజర్‌ తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు సంభవించాయని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.