లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ గంగాధ‌ర‌ ఏఎస్ఐ చంద్రారెడ్డి

ఓ వ్య‌క్తి నుంచి లంచం తీసుకుంటూ ఏఎస్ఐ చంద్రారెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధ‌ర పోలీసు స్టేష‌న్‌లో శుక్ర‌వారం చోటుచేసుకుంది. ఏసీబీ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గంగాధ‌ర మండ‌లం లింగంప‌ల్లి గ్రామానికి చెందిన కొత్త బీర‌య్య అనే వ్య‌క్తి అదే గ్రామంలోని మ‌రో వ్య‌క్తి జొర్రు రాజ‌య్య‌పై జూన్ 10న పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. బీరయ్య త‌న ఫిర్యాదులో రాజ‌య్య కొట్ట‌డంతో ర‌క్త‌స్రావం అయిన‌ట్లుగా తెలిపాడు.

ఫిర్యాదును అనుస‌రించి ఏఎస్ఐ చంద్రారెడ్డి కేసు న‌మోదు చేశారు. అనంత‌రం రాజ‌య్య ఇంటికి వెళ్లి రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. డ‌బ్బు ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైతే జైలులో పెడ‌తాన‌ని బెదిరింపుల‌కు గురిచేశాడు. డ‌బ్బులు చెల్లించే స్థితిలోలేని రాజ‌య్య ఏసీబీని ఆశ్ర‌యించాడు. అవినీతి నిరోధ‌క‌శాఖ అధికారులు ట్రాప్ చేసి ఏఎస్ఐ చంద్రారెడ్డి డ‌బ్బు తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. డీఎస్పీ భ‌ద్ర‌య్య‌, ఇత‌ర సిబ్బంది ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నారు.