పోలీస్‌స్టేష‌న్‌ల‌లో మాన‌వహ‌క్కుల ఉల్లంఘ‌న‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

దేశవ్యాప్తంగా పోలీస్‌స్టేష‌న్‌ల‌లో మానవహక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతున్నాయ‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ( CJI NV Ramana ) ఆందోళన వ్యక్తంచేశారు. న‌ల్సా పేరుతో జాతీయ న్యాయసేవల అథారిటీ రూపొందించిన మొబైల్ యాప్‌ను సీజేఐ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. అదేవిధంగా విజన్ అడ్ మిషన్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించిన ఆయ‌న మాన‌వ‌హ‌క్కుల ఉల్లంఘ‌న, త‌దిత‌ర అంశాల‌పై మాట్లాడారు.

పోలీస్‌స్టేష‌న్‌ల‌లో మానవహక్కుల ఉల్లంఘన అధికంగా జ‌రుగుతున్న‌ద‌ని, సమాజానికి ఇది శ్రేయస్కరం కాదని సీజేఐ వ్యాఖ్యానించారు. సమాజంలో ఇప్పటికీ కస్టోడియల్ హింస, పోలీసుల దాడులు కొనసాగుతుండ‌టం ఆందోళనకరమని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన సంరక్షణ ఉన్నప్పటికీ కస్టోడియల్ హింస తీవ్రం కావడం సరికాదన్నారు. పోలీస్‌స్టేష‌న్‌ల‌లో న్యాయపరమైన ప్రతినిధిత్వం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.