సోమ‌వారం రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధుల జ‌మ‌

పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు సోమ‌వారం విడుద‌ల కానున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద అర్హులైన దేశ‌వ్యాప్త రైతుల‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి వారి ఖాతాల్లో న‌గ‌దు జ‌మ కానుంది. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని మోదీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. దేశ‌వ్యాప్తంగా 9.75 కోట్ల రైతుల ఖాతాల‌కు రూ.19,500 కోట్లు బ‌దిలీ కానున్నాయి. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌ధాని జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద అర్హులైన రైతుల‌కు ప్ర‌తీ నాలుగు నెల‌ల‌కు ఒక‌సారి రూ.2 చొప్పున మూడు ద‌ఫాల్లో వారి ఖాతాల్లోకి బ‌దిలీ అవుతుంది. ఈ ప‌థ‌కం కింద ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు రూ.1.38 ల‌క్ష‌ల కోట్ల‌ను వెచ్చించింది. 8వ విడ‌త ఇన్‌స్టాల్‌మెంట్ గ‌డిచిన మే నెల 14వ తేదీన విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన జాబితాలో ల‌బ్దిదారుల పేరు ఉందో లేదో ఈ క్రింది విధంగా చెక్ చేసుకోవ‌చ్చు.

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి: https://pmkisan.gov.in/
  • కుడి వైపున ‘ఫార్మర్స్ కార్నర్’ ఎంపిక చేసుకోవాలి
  • ‘లబ్ధిదారుల జాబితా’ ఎంపికపై క్లిక్ చేయాలి
  • కొత్త పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామ వివరాలను ఫిల్ చేయాలి
  • గెట్ రిపోర్ట్‌ బటన్‌పై క్లిక్ చేయాలి
    వ‌చ్చిన‌ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ప‌రిశీలించుకోవ‌చ్చు.