తెలంగాణ ప్ర‌భుత్వంపై షెడ్యూల్ కులాల జాతీయ కమిష‌న్ ఉపాధ్య‌క్షుడు అరుణ్ హ‌ల్దార్ ప్ర‌శంస‌లు

రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను షెడ్యూల్ కులాల జాతీయ కమిష‌న్ ఉపాధ్య‌క్షుడు అరుణ్ హ‌ల్దార్ ప్ర‌శంసించారు. మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులతో అరుణ్ హ‌ల్దార్‌ సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా అరుణ్ మాట్లాడుతూ.. ఏదైన సంఘటన జరిగిన వెంటనే స్పందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు. మానవతా దృక్పథంతో ఎస్సీల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.

షెడ్యూల్డ్ కులాల సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎస్ ఈ సంద‌ర్భంగా అరుణ్‌కు వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి చట్టాన్ని అమలు చేస్తోంది, దేశంలో ఇలాంటి చట్టం తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. జనాభా నిష్పత్తి ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌లో 15.45% నిధులను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన‌ట్లు చెప్పారు. ఈ నిధులలో ఖర్చు చేయని సోమ్ము మరుసటి సంవత్సరం నిధులకు అదనంగా జమ అవుతుందని వివ‌రించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నోడల్ కమిటీల ద్వారా షెడ్యూల్డ్ కులాలపై జరిగే అట్రాసిటి కేసులను మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ప్లాగ్ షిప్ కార్యక్రమంలో భాగంగా షెడ్యూల్ కులాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యా సంస్థలను నడుపుతోందని తెలిపారు. ఇక్కడ అందించిన మెరుగైన నాణ్యత విద్యా కారణంగా అనేక మంది విద్యార్థులు దేశ, విదేశాలలో అత్యున్నత విద్యాసంస్థలతో ప్రవేశాలు పొందారన్నారు. షెడ్యూల్డ్ కులాల వారిపై జరిగిన అట్రాసిటి కేసులను పరిష్కరించడంలో ప్రభుత్వ నిబద్ధతను అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మరియమ్మ కేసు సంఘటను వివరించారు. బాధిత కుటుంబానికి ఉపశమనంతో పాటు, కుమారునికి ఉపాధి కల్పించబడింది. అలాగే ఈ సంఘటనతో సంబంధం ఉన్న పోలీసు ఉద్యోగులను సర్వీస్‌ నుండి తొలగించినట్లు అరుణ్ హల్దార్ కు అధికారులు వివరించారు.

ఈ సమావేశంలో NCSC డైరెక్టర్ జి.సునీల్ కుమార్ బాబు, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, అడిషనల్ డీజీపీ, సీఐడీ గోవింద్ సింగ్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, ఎస్‌సీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.