రైతు బీమా.. ఎల్ఐసీకి రూ.1450 కోట్లు అంద‌జేత‌

రైతు బీమా కోసం 2021 – 2022 సంవత్సరానికి గాను రూ.1450 కోట్ల‌ను ఎల్ఐసీ ప్ర‌తినిధుల‌కు చెక్కుగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లశాఖ మంత్రి కేటీఆర్ అంద‌జేశారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

ప్రపంచంలో రైతుకు ప్రీమియం చెల్లించి బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా అన్నారు. అన్నం పెట్టే రైతన్న ఆత్మవిశ్వాసంతో సాగు చేసేందుకే వ్యవసాయ అనుకూల విధానాలు అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, వందశాతం పంటల కొనుగోళ్లతో తెలంగాణ రైతాంగం ఆత్మస్థయిర్యం పెరిగింద‌న్నారు.

సమైక్యరాష్ట్రంలో నష్టపోయిన రైతాంగం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్దికి వ్యవసాయరంగ పథకాలే నిదర్శనమ‌న్నారు. సమైక్య పాలనలో రైతుకు కష్టం వస్తే పట్టించుకున్న నాధుడు లేడ‌న్నారు. రూ.50 వేల ఆపద్భందు సొమ్ము కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసినా అరకొర మందికే అది దక్కేదన్నారు. కానీ ఇప్పుడు రైతు ఏ కారణం చేత మరణించినా పది రోజుల లోపు రూ.5 లక్షల చెక్కును ఇంటికి తెచ్చిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు.