- 7న క్యాబినెట్లో చర్చించి నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. నవంబరు మూడో తేదీన హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఆ తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.నవంబరు 7న మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. సచివాలయంలో గురువారం రాత్రి మంత్రివర్గ సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ బలరామ్‌నాయక్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పొంగులేటి తెలిపారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లామని, హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించిందని, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి హైకోర్టును ఆశ్రయించిందని వెల్లడించారు. నవంబరు 3న ఈ కేసు హైకోర్టులో విచారణకు వస్తుందని తెలిపారు.
ఆ రోజున ఇచ్చే తీర్పును ఏడున కేబినేట్ సమావేశంలో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల అమలుపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా శ్రీశైలం నుంచి ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండకు నేరుగా గ్రావిటీ, టన్నెల్ ద్వారా కృష్ణా జలాలను తీసుకురావాలనే సంకల్పంతో ఎస్‌ఎల్‌బీసీ మొదలు పెట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి గుర్తు చేశారు. మొత్తం 44 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి గాను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 32 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు మంచినీటిని అందించే ప్రయత్నం చేయలేదని అన్నారు. పదేళ్ల పాలనలో కేవలం రెండున్నర కిలోమీటర్ల టన్నెల్ పనులు మొక్కుబడిగా చేసి చేతులు దులిపేసుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయాలని సంకల్పించిందని తెలిపారు. కాంట్రాక్టు ఏజెన్సీకి ఎదురైన సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించి ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఈ ఏడాది జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో 10-11 మంది ప్రాణాలు పోయాయని ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ సొరంగ మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నామని, ఇప్పటికే 80 శాతం వరకు నిధులు ఖర్చు చేశామని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే 30 టీఎంసీల నీరు రూపాయి ఖర్చు లేకుండా ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ ప్రాంతానికి గ్రావిటీలో వస్తుందని చెప్పారు. టీబీఎంలతో చేసే పనులకు ఫుల్ స్టాప్ పెట్టి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి అదనంగా ఖర్చు కాకుండా ఉండేలా, అదే ఏజెన్సీతో పనులు చేయించి, 2027 ఆరంభంలోగా పనులు పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి వెల్లడించారు.