తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లోగో ఆవిష్కరణ

  • ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ ఫ్రీ నంబరు 14432
  • నవంబరు 2 వరకు విజిలెన్స్‌ అవగాహనా వారోత్సవం

తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిక లోగోను విజిలెన్స్‌ కమిషనర్‌ ఎంజీ గోపాల్‌, రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ శిఖా గోయల్‌ ఆవిష్కరించారు. విజిలెన్స్‌ అవగాహనా వారోత్సవం సందర్భంగా బీఆర్‌కే భవన్‌లో సోమవారం సంస్థ లోగోను ఆవిష్కరించారు. ప్రజా సేవలో నిజాయితీ, పారదర్శకత, బాధ్యతను ప్రతిభించేలా నూతన లోగోను రూపొందించారు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ ఫ్రీ నంబరు 14432తోపాటు సోషల్‌ మీడియా వేదికలు ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఖాతాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ కమిషనర్‌ ఎంజీ గోపాల్‌ మాట్లాడుతూ సమిష్టి బాధ్యతతో నిజాయితీని పెంపొందించుకోవడం అవసరమన్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ శిఖా గోయల్‌ మాట్లాడుతూ.. తప్పులు జరక్కుండా నివారించడమే విజిలెన్స్‌ అని చెప్పారు.