జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్‌ చేయాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. జగ్గారెడ్డి ఎప్పుడూ జనంలో ఉండే మాస్‌ లీడర్‌ అని, మరో పీజేఆర్‌ అని వ్యాఖ్యానించారు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే ఆదుకునే మనస్తత్వం జగ్గారెడ్డిదని గుర్తు చేశారు. అలాంటి మాస్‌ లీడర్‌ను టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వంద సీట్లు కచ్చితంగా వస్తాయని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ లాబీల్లో మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన.. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ మంత్రి శ్రీధర్‌బాబు సైతం స్పందించారు. పార్టీలో జగ్గారెడ్డి సీనియరేనని, టీపీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమించాలనేదీ అధిష్ఠానం చేతిలో ఉంటుందని, తన చేతిలో ఉండదని వ్యాఖ్యానించారు.