మీ ప్ర‌త్యేక‌త‌ను చూపిన‌ప్పుడే విజ‌యం:

  • ప్ర‌జాప్ర‌యోజ‌న‌మే లక్ష్యంగా ప‌ని చేయాలి
  • గ్రూప్‌- 1కు ఎంపికైన‌ వారికి హైడ్రా క‌మిష‌న‌ర్ దిశానిర్దేశం

“ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీనే మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా మీ చ‌ర్య‌లుండాలి. మీ ప్ర‌తి చ‌ర్య పార‌ద‌ర్శ‌కంగా ఉండాలి.. ప్ర‌జాప్ర‌యోజ‌నమే ల‌క్ష్యంగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంటే.. ప‌రిపాల‌న సుల‌భమౌతుంది. వారి మ‌ద్ధ‌తు కూడా సంపూర్ణంగా అందుతుంది. చ‌రిత్ర‌ను ఫాలో అయి.. మీ విభాగాల్లో ఎవ‌రికి వారు కొత్త చ‌రిత్ర‌ను సృష్టించాలి “ అని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు అన్నారు. గ్రూప్ -1 కేడ‌ర్‌కు ఎంపికైన ఉద్యోగుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మంల భాగంగా శుక్ర‌వారం డా. మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ మాట్లాడారు. హైడ్రా కార్య‌క‌లాపాల‌ను వివ‌రించారు. ఆదిలో హైడ్రా ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను.. వాటిని అధిగ‌మించిన తీరును తెలిపారు. హైడ్రా అంటే ప్ర‌జ‌ల్లో పూర్తిగా అవ‌గాహ‌న రావ‌డంతో తాము చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు పూర్తి స్థాయి మ‌ద్ధ‌తు ల‌భిస్తోంద‌న్నారు. సామాజిక మాధ్య‌మాల్లో గ‌మ‌నిస్తే.. హైడ్రా అంటే ఆదిలో దాదాపు 70 శాతం నెగిటివిటీ క‌నిపించేది.. ఇప్పుడా శాతం రివ‌ర్స్ అయ్యింద‌న్నారు. 85 శాతం మంది హైడ్రా ప‌ట్ల సానుకూల దృక్ప‌థంతో ఉన్నార‌న్నారు. ఇదంతా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా మ‌న కార్య‌క‌లాపాలు సాగించ‌డం.. గ్రౌండ్‌మీద ఫ‌లితాలు చూపించ‌డంతో సాధ్య‌మైంద‌న్నారు.

రాత‌లు కాదు.. చేత‌లు క‌నిపించాలి..
స‌మాజ ప్ర‌యోజ‌నాలు కోరి మంచి చ‌ట్టాలు రూపొందించుకున్నాం. పేప‌రు మీద అన్నీ ఉంటాయి.. కాని వాటిని అమ‌లు చేయ‌క‌పోతే ప్ర‌యోజ‌నం లేద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు తెలిపారు. త‌మ్మిడికుట ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత కాని.. ప్యాట్నీ నాలా ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించ‌డంలో కాని.. ఇలా అనేక విష‌యాల్లో స్ప‌ష్టంగా ఉల్లంఘ‌న‌లున్నా.. వాటిపై చ‌ర్య‌లుండేవి కాదు. హైడ్రా ఆ ఒర‌వ‌డిని మార్చింది. న‌గ‌రంలో ఇప్ప‌టికే 3 చెరువుల‌ను పున‌రుద్ధ‌రించ‌గా.. మ‌రో 22 చెరువులను అందుబాటులోకి తెచ్చుందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. చెరువుల్లో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన‌ప్పుడు విమ‌ర్శించిన వారే ఇప్పుడు అభినందిస్తున్నారు. కాలువ‌ల్లో పూడిక‌ను పెద్ద‌మొత్తంలో తొల‌గించ‌డం ద్వారా గ‌త వ‌ర్షాకాలంలో వ‌ర‌ద ముప్పుతో పాటు.. నీటి మున‌క స‌మ‌స్య న‌గ‌రంలో త‌లెత్త‌కుండా చూశామ‌న్నారు. చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌, కాలువ‌ల ప‌రిర‌క్ష‌ణ ఆవ‌శ్య‌క‌త‌ను ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. గ్రూప్ -1 అధికారులుగా ఎంపికైన వారి సందేహాల‌ను కూడా ఈ సంద‌ర్భంగా నివృత్తి చేశారు. తాను నిర్వ‌హించిన అన్ని విధులూ సంతృప్తినిచ్చాయ‌ని.. ఎక్క‌డ ఉన్నా.. ఏ బాధ్య‌త‌లు అప్ప‌గించినా వాటిని మ‌న‌సారా స్వీక‌రించి నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేయ‌డ‌మే త‌న విధాన‌మ‌ని మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకమై.. వారి సాద‌క బాధ‌కాలు తెలుసుకోడానికి ప్ర‌జావాణి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటూ పోతే.. మ‌న విధులు తేలికౌతాయ‌ని సూచించారు. హైడ్రా కార్య‌క‌లాపాల‌ను ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తున్నామ‌ని.. హైడ్రా ప‌నితీరు మాకంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌క‌మౌతుంద‌ని కొత్త‌గా ఎంపికైన ఉద్యోగులు ఈ సంద‌ర్భంగా తెలిపారు.