అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రాష్ట్రంలో విప‌త్తుల శిక్ష‌ణా కేంద్రం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌పై స‌మీక్ష నిర్వ‌హించిన రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శిక్ష‌ణా కేంద్రాన్ని (SIDM) ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్దం చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత విభాగాల నుంచి ఉన్న‌త‌స్ధాయి క‌మిటీని ఏర్పాటు చేసుకొని కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని సూచించారు. దీనిపై గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారితో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు విపత్తు నిర్వహణపై ఒకే విధమైన శిక్షణను అందించడం, శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రాణ నష్టాన్ని, ఆర్థిక నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించడం, క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా జిల్లాల్లో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం. విపత్తుల నివారణకు సంబంధించి ఇది ఒక అత్యున్నత పరిశోధన మరియు పాలసీ సపోర్ట్ కేంద్రంగా పనిచేస్తుంద‌ని అన్నారు.
శుక్ర‌వారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో విప‌త్తుల నిర్వ‌హ‌ణా విభాగం, ఫైర్ స‌ర్వీసెస్‌, ఎస్‌డిఆర్ఎఫ్‌, హైడ్రా, ఐ సిసిసి విభాగాల‌తో మంత్రి గారు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు కేవలం సహాయక చర్యలకే పరిమితం కాకుండా, ముందస్తు సన్నద్ధతతో నష్టాన్ని తగ్గించే లక్ష్యంతో ‘స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్’ (SIDM) ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించారు. విపత్తుల నిర్వహణలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు.
ఎటువంటి విప‌త్తుల‌నైనా ఎదుర్కొనేలా అత్యాధునిక ప‌రికరాల‌ను కొనుగోలు చేస్తున్నామ‌ని తెలిపారు. వ‌ర‌ద‌లు, అగ్నిప్ర‌మాదాలు వంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్ధితుల్లో త్వ‌రిత‌గ‌తిన స్పందించ‌డానికి క‌చ్చిత‌మైన స‌మాచార వ్య‌వ‌స్ధ‌, రియ‌ల్ టైమ్ మానిట‌రింగ్‌, సాధ్య‌మ‌య్యేలా విప‌త్తు ముంద‌స్తు హెచ్చరిక వ్య‌వ‌స్ద‌లు, డ్రోన్‌లు, హైస్పీడ్ బోట్లు వంటివాటిని కొనుగోలు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి దాన‌కిశోర్‌ , అగ్పిమాప‌క‌శాఖ డైరెక్ట‌ర్ విక్ర‌మాన్ సింగ్‌, హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాధ్‌, ఐసిసిసి డైరెక్ట‌ర్ క‌మ‌ల్‌హాస‌న్‌రెడ్డి, స్పెష‌ల్ పోలీస్ బెటాలియ‌న్ అడిష‌న‌ల్ డిజీ సంజ‌య్ జైన్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.